విశాఖలో టెన్షన్ .. పవన్ అరెస్ట్ పై..?
విశాఖలో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న విశాఖకు వచ్చిన పవన్ కల్యాణ్ పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు
విశాఖలో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విమానాశ్రయంలో జనసైనికులు మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడులు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కొందరు జనసేన కార్యకర్తలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఐపీసీ 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీస్ స్టేషన్ కు వెళతానని..
అయితే పవన్ కల్యాణ్ మాత్రం తాజాగా చేసిన ట్వీట్ తో ఉద్రిక్తత తలెత్తింది. విశాఖ పోలీసుల దురుసు ప్రవర్తన చాలా దురదృష్టకరమని, జనసేన ఎప్పుడూ పోలీసులను గౌరవిస్తుందని, జనసేన నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ట్వీట్ చేశఆరు. డీజీపీ జోక్యం చేసుకుని అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తానే పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ నేతలకు సంఘీభావం తెలుపుతానని ప్రకటించారు.
జనవాణి కార్యక్రమంలో...
దీంతో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుపై చర్చించారు. కొద్ది సేపటి క్రితం ఆయనతో చర్చించి జనవాణి కార్యక్రమం, భద్రతపై చర్చించారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్ కళావాణి ఆడిటోరియంలో జరగనున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అక్కడకు భారీ ఊరేగింపుతో వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. నేరుగా జనవాణి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు తెలిపినట్లు తెలిసింది. పవన్ ను అరెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మరో వైపు జనవాణి కార్కక్రమాన్ని తాము అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర జేఏసీ ప్రకటించింది. నోవాటెల్ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.