కోమటిరెడ్డి కవ్వింపు అందుకేనటగా?
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో పార్టీని వీడే సూచలను స్పష్టంగా కనిపిస్తున్నాయి
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో పార్టీని వీడే సూచలను స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మార్గంలోనే ఆయన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేశారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఇందుకు సిద్ధమయినట్లే కనపడుతుంది. కోమటిరెడ్డి పార్టీని వీడినా పరవాలేదన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చింది. అందుకే చూసీ చూడనట్లు వదిలేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ తనపై చర్యలకు దిగేంత వరకూ కోమటిరెడ్డి కవ్విస్తూనే ఉంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీజేపీ నేతలను కలుస్తూ....
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరసగా బీజేపీ నేతలను కలవడం కూడా పార్టీ ఒక నిర్ణయానికి రావడానికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పి వరసగా ప్రధాని మోదీని కలుస్తున్నారు. ఇటీవల అమిత్ షాను కలిశారు. వరద బాధితులకు సాయం చేయాలని కోరేందుకు మాత్రమే తాను కలిశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చెవిలో పువ్వులు పెట్టడమే. వరద తాకిడికి గురైన ప్రాంతాల కోసం నిధులు కావాలంటే అమిత్ షాను కలవాల్సిన పనిలేదు. మోదీని కలిసినప్పుడే ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించే వీలుంది.
కొంత సమయం తీసుకుని....
కానీ శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకూ కాంగ్రెస్ లోనే ఉండి ఎన్నికలకు ముందు బీజేపీలోకి రావాలన్న వ్యూహం కావచ్చు. ఆయన ఇప్పటికిప్పుడే బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ ను మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేయవచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సాకుగా చూపిస్తూ ఆయన మరింత పార్టీని దిగజార్చే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను వీడి పార్టీలో చేరినా ప్రయోజనం లేదు. అందుకే కొంత గ్యాప్ ఇచ్చి చేరాలన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది.
ఒకే బాట...
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒకే మాట.. ఒకే బాట అని అంటారు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. రాజకీయాలు కూడా ఒకే పార్టీలో చేసే నేతలు వాళ్లు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉండి ఎన్నో పదవులు పొందిన ఆ బ్రదర్స్ ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉంటారనుకోవడం భ్రమే అవుతుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలోనే పార్టీన వీడతారంటున్నారు. కాంగ్రెస్ కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశముంది. ఇప్పటికే పార్టీకి దాసోజు శ్రావణ్ కుమార్ రాజీనామా చేశారు. మరికొంత మంది కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దశల వారీగా పార్టీని బలహీనపర్చి, బీజేపీ బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమయితాయో చూడాల్సి ఉంది.