హాట్‌టాపిక్‌గా కోమటిరెడ్డి ఎపిసోడ్
కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతంగా ముద్రవేసుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ పదవితో మొదలైన రగడ చివరికి పార్టీని అధోపాతాళానికి పడిపోయేంత అతిపెద్ద సమస్యగా పరిణమించింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన వారిని కాదని ఎనిమిదేళ్ల ముందు వరకూ ప్రత్యర్థి పార్టీగా ఉన్న టీడీపీ నుంచి వచ్చిన నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నమ్మకస్తుడిగా ఎదిగిన నేతకు కాంగ్రెస్ చీఫ్ హోదా కట్టబెట్టడాన్ని ససేమిరా ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అంగబలం.. అర్థబలం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి నేతలను కూడా ఉంటే ఉండండి.. వెళ్తే వెళ్లండి అనే వరకూ పీసీసీ నేత సాహసం చేశారంటే ఇక ఆ పార్టీలో ఉండే సీనియర్ నేతలెవరైనా మిగులుతారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రెడ్లదే హవా...
తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి నేతలదే హవా అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పటేల్.. పట్వారీ వ్యవస్థలు రద్దైనా రెడ్డి నేతలే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అందుకు పార్టీలతో నిమిత్తమే లేదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా.. తెలుగుదేశం అయినా.. కల్వకుంట్ల వారి టీఆర్ఎస్ అయినా వారికే పెద్దపీట. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రధాన పార్టీలకు అభ్యర్థులు వారే. గెలిచిన తర్వాత అమాత్యులు కూడా వారే. అది ముందే గుర్తించిన కేసీఆర్ సార్ వారికి తగినంత ప్రాధాన్యం కల్పిస్తూనే ఉన్నారు. ఉద్యమం నుంచి ప్రభుత్వంగా మారిన తర్వాత ఉద్యమ నేపథ్యం లేకపోయినా కేబినెట్ బెర్తులు కూడా ఇచ్చేశారు. మొత్తంగా అంగబలం.. అర్థబలం ఉన్న రెడ్డి నేతల సహకారం అత్యంత కీలకమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే అనాదిగా అండగా నిలుస్తున్న రెడ్లను కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరం చేసుకుంటుండడం అస్సలు మింగుడుపడని విషయం.
ఇందిరకు భంగపాటు...
అప్పటి కా బ్రహ్మానంద రెడ్డి దగ్గరి నుంచి మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకూ రాజకీయాల్లో బలమైన నేతలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వారే. పార్టీకి విధేయంగా ఉంటూనే సూపర్ పవర్‌గా ఎదిగారు. ఒకవేళ పార్టీ తమను విస్మరిస్తే రెండుగా చీల్చేసిన సందర్భాలూ లేకపోలేదు. ఇండియన్ ఐరన్ లేడీ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ధైర్యం రెడ్డి నేత కాసు బ్రహ్మానందరెడ్డిదే. ఫలితంగా 1978 ఎన్నికల్లో ఆ పార్టీ ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్‌గా పోటీ చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విధేయతను బానిసత్వంగా చూస్తే ఊరుకునేది లేదని అప్పటి మహామహులకే దిమ్మతిరిగేలా గట్టి గుణపాఠం చెప్పేశారు. ఇటీవల వైఎస్సార్ మరణం తర్వాత కూడా మళ్లీ అదే సీన్ రిపీటైంది. జగన్ రెడ్డి దిగిరాలేదన్న అక్కసుతో కక్షసాధింపు చర్యలకు దిగి అస్సలు పార్టీ పుట్టి ముంచేశారు ఏపీలో. ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేని స్థితిలోకి.. అసలు అభ్యర్థినే నిలబెట్టలేని దుర్భర స్థితిలోకి నెట్టేశారు. జగన్ రెడ్డి మీద కోపంతో అందరు రెడ్లను దూరం చేసుకోవడంతో పార్టీయే లేకుండా పోయింది. జగన్ పార్టీ కూడా పేరుకే కొత్త పార్టీ కానీ.. అంతకు ముందు కాంగ్రెస్ నేతలే మూకుమ్మడిగా పార్టీలో చేరిపోవడంతో హస్తం పార్టీ ఖాళీపోయింది. జగన్ పార్టీ పేరు ముందు వైఎస్సార్ వచ్చి చేరిందంతే.
తెలంగాణలోనే అదే సీన్?
ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతే అధ్వానంగా తయారవుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో అధిష్టానమే ఆజ్యం పోసినట్టయింది. పాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ తర్వాత కోమటిరెడ్డికే అవకాశం దక్కుతుందని సీనియర్ నేతలు భావించారు. ఆయన కూడా గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం నిర్ణయంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. దశాబ్దాల తరబడి పార్టీ జెండాను మోస్తున్న వారిని కాదని.. వేరే వారికి అధ్యక్ష పదవి కట్టబెడతారా? అని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపించారు. అయితే రేవంత్ రెడ్డి కొద్దికాలం మౌనం వహించడంతో అంతా సర్దుకుంటుందని భావించారు. కానీ అది లోలోపల అగ్నిపర్వతంగా మారి బద్దలవుతుందని ఊహించి ఉండరు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం వేచిచూసినట్టుగా ఎవడైతే నాకేంటి అనే రేంజ్‌లో రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లిపోతానంటే.. అన్న వెంకట్ రెడ్డిని కూడా అందులోకి లాగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ దొందూ దొందే అనే రీతిలో రేవంత్ వ్యాఖ్యలు వెంకట్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయి కూడా. ఇంత జరుగుతున్నా నల్లగొండ జిల్లా సీనియర్ నేతలు జానా రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా కలగజేసుకోకపోవడం వ్యూహాత్మక మౌనంగానే భావించాల్సి ఉంటుంది. ఏమీ చేయలేక వారు మౌనంగా ఉన్నారని అనుకుంటే మాత్రం పొరపాటే.
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్...
గత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన సీనియర్ కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి వంటి నేతలు సైతం కాంగ్రెస్ కండువా తీసేసి కారెక్కేశారు. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూడొంతుల్లో రెండొంతుల మంది కేసీఆర్‌కి జైకొట్టి పార్టీని టీఆర్ఎస్‌ఎల్పీలో కలిపేశారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఊబి నుంచి బయటపడేయాల్సిన అధిష్టానమే పీసీసీ విషయంలో ఏకాభిప్రాయం సాధించకుండా పెద్ద తప్పు చేసేసింది. తమ ఇష్టానుసారం చేస్తే భరించాల్సిన అవసరం లేదని నేతలు బాహాటంగానే విమర్శలు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అని చెప్పుకునే నేతలు.. అస్సలు హద్దులు లేవనే స్థాయికి వచ్చేశారు. ఒకరంటే మరొకరికి పడక పార్టీని బజారుకీడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జగన్ మాదిరి కొత్త కుంపటి పెట్టే రెడ్డి లేకపోవడం వల్లేనేమో మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఓటు బ్యాంకు ఏమవుతుంది?
నేతలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఓటుబ్యాంకు ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునే నేత ఎవరు? లేక ఆ ఓటుబ్యాంకును తమ వైపు తిప్పుకునే నాయకుడెవరు? నేతలు పార్టీ మారితే క్యాడర్ కూడా మారిపోతుందా? బలమైన నేతలందరూ మరో గొడుగు కిందకు చేరితే జగన్ పార్టీ మాదిరి ఆ పార్టీ కూడా పుంజుకుంటుందా? ఒక్కసారిగా కాకపోయినా మరో ఎన్నికల పండగ నాటికి బలమైన పార్టీగా మారితే కాంగ్రెస్ పరిస్థితేంటి? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే ఇక్కడ చర్చించాల్సిన అంశం మరొక్కటి. టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా అదే సామాజిక చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయన్ను అనుసరించే కాంగ్రెస్ రెడ్లు ఎందరనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన ఈ పరిస్థితి ముందే గ్రహించినట్టున్నారు ఇప్పటికే ఒక మీటింగ్‌లో రెడ్డి రాజ్యం రావాల్సిన అవసరముందంటూ రెడ్లందరికీ సంకేతాలు పంపారు. తనను సపోర్ట్ చేయాలంటూ అడగకుండానే అడిగేశారు. అయితే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో దర్జాగా హోదాలనుభవించిన సీనియర్ నేతలు కేసీఆర్, చంద్రబాబు అనుయాయుడిగా ఎదిగిన రేవంత్‌ను ఎంతవరకూ నమ్ముతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అంగ, అర్థబలాల ముందు....
అగ్రవర్ణాలను కాదని బీసీలు, ఎస్సీలు, ముస్లిం, మైనార్టీలను కలుపుకుని వెళ్లేందుకు సిద్ధమైనా ఆశించిన ఫలితాలొస్తాయని చెప్పలేమని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఒక ఓసీ నియోజకవర్గంలో బీసీ నేత నిలిచి గెలిచిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అలాంటి అవకాశాలిచ్చిన పార్టీలు కూడా అరుదే. అంగబలమో.. అర్థబలమో సాకుగా చూపి వెనకబడిన వర్గాల వారిని భయబ్రాంతులకు గురిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అందులోనూ తెలంగాణ రెడ్డి నేతల అంగబలం, అర్థబలం ముందు మిగిలిన వర్గాల నేతలు నిలబడగలరా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. డబ్బు, మందు, కులంతో ముడిపడిపోయిన మన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఉత్తమ ఫలితాలు ఆశిస్తే అత్యాశే అవుతుందేమో