కర్ణాటకలో కాంగ్రెస్ కు ఈసారి ఈజీనా?
కర్ణాటక మీద కాంగ్రెస్ ఈసారి ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించనుంది;
కర్ణాటక మీద కాంగ్రెస్ ఈసారి ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. బలమైన నాయకత్వం, ఓటు బ్యాంకు, పటిష్టమైన క్యాడర్ ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళుతుంది. ఒంటరిగానే ఈసారి అధికారంలోకి రావాలన్న యోచనలో ముందు నుంచి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల అనంతరం పొత్తులు కావాలన్నా అధికారాన్ని మాత్రం తమ చేతిలోనే ఉంచుకోవాలన్న ధోరణిలో ఉంది. అందుకే కర్ణాటకలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమవుతుందని సమాచారం. మరో నెలలోనే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించేందుకు సిద్ధమవుతుంది.
ఆరు నెలలు ఎన్నికలు...
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల వరకూ గడువు ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టిన తర్వాత క్యాడర్ లో మరింత ఉత్సాహం పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సయోధ్యతగానే పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుంది. డీకే శివకుమార్ పై ఐటీ, ఈడీ దాడులు వంటివి కూడా కాంగ్రెస్ కు కలసి వచ్చేవిగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడాన్ని కూడా ప్రజలు తప్పు పడుతున్నారు. బీజేపీకి ఇప్పుడు నాయకత్వం సరైనదని లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పించిన తర్వాత లింగాయత్ లు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీ బలహీనంగా...
యడ్యూరప్ప ఎన్నికల్లో పోటీ చేయరు. ఆయన తనయుడు పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఆ కుటుంబానికి ఇక ముఖ్యమంత్రి పదవి దక్కదన్న అభిప్రాయం లింగాయత్ లలో ఉంది. ఇక జనతాదళ్ ఎస్ కూడా బలహీనమయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమయిన ఆ పార్టీ వల్ల ఈసారి తమకు ఏ మాత్రం ముప్పు లేదని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకోసమే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల్లో వనసైడ్ విక్టరీని సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకే 150 మంది అభ్యర్థుల జాబితాను డిసెంబరులో ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.
జోడో యాత్రతో...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సక్సెస్ కావడం, ఆవేడి తగ్గకుండా రాష్ట్రంలో ఆ పార్టీ బస్సు యాత్రకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే 150 నియోజకవర్గాలలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే నిర్వహించి అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేశారు. హైకమాండ్ ఈ నివేదికకు ఆమోదం తెలిపిందని చెబుతున్నారు. ఏఐసీీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అదే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ముందుగానే అక్కడ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యూహలను సిద్ధం చేసుకుంటుంది. అక్కడ గెలిచి పార్టీకి పూర్వవైభవం దేశ వ్యాప్తంగా తేవాలన్న యోచనలో హైకమాండ్ ఉంది. అందుకే స్ట్రాటజీలను మారుస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.