Telangana : గుడ్ న్యూస్.. ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులు.. రేషన్ కార్డులు

తెలంగాణ ప్రజలకు రేవంత రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది.;

Update: 2025-01-05 02:10 GMT

తెలంగాణ ప్రజలకు రేవంత రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా అదే రోజు నుంచి మంజూరు చేస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామన్న సర్కార్ ఈ నెల 26వ తేదీన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. భారత గణతంత్ర వేడుకలతో పాటు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆరోజు నుంచి రైతు భరోసా నిధులతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.

వ్యవసాయ యోగ్యమైన...
వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా నిధులను చెల్లిస్తామని తెలిపింది. రైతులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాళ్లు, రప్పలున్న భూములకు, అటవీ భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వినియోగించే భూమికి మాత్రం రైతు భరోసా చెల్లించడం లేదని తెలిపింది. త్వరలోనే వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ యోగ్యమైన భూములను లెక్కించి దానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తారని తెలిపింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లించేలా కాంగ్రెస్ సర్కార్ ముందుకు వచ్చింది. మంత్రి వర్గం కూడా ఈ మేరకు ఆమోదం తెలిపిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎకరానికి పన్నెండు వేలు...
గత ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే, తమ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 12 వేల రూపాయలు చెల్లిస్తుందని తెలిపింది. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఏడాదికి చెల్లిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి షరతులు ఉండబోవని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు రైతు భరోసా నిధులను చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఇక గత కొద్ది రోజులుగా రేషన్ కార్డుల కోసం అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, వారికి కూడా జనవరి 26వ తేదీ నుంచి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త ఏడాది ఈ మూడు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


 


Tags:    

Similar News