జాయిన్ అయి జావగారిపోయారే.....?

Update: 2018-09-08 02:30 GMT

అసెంబ్లీ రద్దు నిర్ణయంతో తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ఇక అసెంబ్లీ రద్దు చేసిన గంటలోనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలనానికి తెరతీశారు. దీంతో అన్ని పార్టీల్లోనూ ఎలక్షన్ ఫీవర్ వచ్చేసింది. అయితే, టిక్కెట్ల ప్రకటన విషయంలో ఎన్నో ఊహాగానాలను కొట్టివేస్తూ ఇంచుమించు సిట్టింగులు అందరికీ కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. అయితే, గత ఎన్నికల తర్వాత గులాబీ దళపతి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించగా ‘‘బంగారు తెలంగాణ’’ సాధించే పేరుతో పెద్దఎత్తున ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఒక్కో స్థానంలో రెండు నుంచి ఐదు మంది వరకు ఆశావాహులు తయారయ్యారు. అయితే, కేసీఆర్ మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లు ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పడు అసంతృప్తిని రాజేస్తోంది.

టిక్కెట్ ఇస్తామని చేర్చుకుని...

ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారీ సంఖ్యలో నియోజకవర్గ స్థాయి నేతలకు గులాబీ కండువాలు కప్పేసింది. వీరిలో చాలా మందికి ఈ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామనే హామీలు కూడా ఇచ్చారు. ఇలా వచ్చిన వారిలో భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణరావు, భువనగిరికి చెందిన ఉమా మాధవరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన రాజారపు ప్రతాప్, ఖానాపూర్ కు చెందిన రమేశ్ రాథోడ్ వంటి అనేకమందికి టిక్కెట్ల కేటాయింపులో ఆశాభంగమే ఎదురైంది. నల్గొండ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. దీంతో వీరంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. భూపాలపల్లిలో గండ్ర అనుచరులు కేసీఆర్ దిష్టబొమ్మను కూడా దహనం చేశారు. టీఆర్ఎస్ తనను మోసం చేసిందని రాజారపు ప్రతాప్ ఆరోపిస్తున్నారు. ఇక అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రమేశ్ రాథోడ్ అంటున్నారు. దీంతో టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పేలా లేదు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో...

ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం అందరికీ కేసీఆర్ టిక్కెట్లను కన్ఫర్మ్ చేసేశారు. అయితే, ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుమారు 25 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కాయి. దీంతో ఇంతకాలం టీఆర్ఎస్ జెండా మోసిన వారికి కాకుండా ‘బంగారు తెలంగాణ’ బ్యాచ్ వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. కొందరు పక్కచూపులు కూడా చూస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నాయకులు మాత్రం ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగాలని కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో అసంతృప్తులు అందరినీ టీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, వారు పార్టీ విజయానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.

Similar News