మూడు నెలలు చుక్కలు కనిపిస్తాయా...?

Update: 2018-10-01 04:30 GMT

భాగ్యనగర్ లో అత్యంత రద్దీగా వుండే ప్రాంతంలో మూడు నెలలు వాహనదారులకు చుక్కలు కనిపించనున్నాయి. డబుల్ రోడ్డు ఉంటేనే ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. అయితే త్వరలో ఈ ప్రాంతంలో అమలు చేయబోయే వన్ వే ను తలచుకుని హైదరాబాదీలు ముఖ్యంగా హైటెక్ సిటీ పరిసర ప్రాంత వాసులు హడలి పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం చూడాలంటూ కొత్త దారులు గూగుల్ లో ఇప్పుడే వెతకడం మొదలు పెట్టేశారు. తమ ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికి తీరతాయా అని బెంగ పెట్టుకున్నారు.

అసలు కారణం ఇదే...

హైటెక్ సిటీ వైపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబోవడానికి ప్రధాన కారణం మెట్రో. భాగ్యనగర్ లోని మెట్రో విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా అత్యంత రద్దీగా వుండే ఈ ప్రాంతంలో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఈ పనులు వేగవంతం చేయాలంటే ట్రాఫిక్ నియంత్రించడం తప్పని సరి. దీనిపై తీవ్ర తర్జనభర్జన పడుతున్న అధికారులు గత్యంతరం లేని పరిస్థితిలో వన్ వే విధానం అమలు చేయక తప్పడం లేదంటున్నారు. ప్రజలు సుమారు మూడు నెలల పాటు రోడ్డు నరకం భరించక తప్పదని ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అయితే కొత్త నిబంధనలు ఎప్పటినుంచి జనం నెత్తిన పెడతారో ఇంకా ప్రకటించలేదు.

Similar News