అమెరికాలో ఉంటున్న భారతీయులకు ట్రంప్ సర్కారు మరో భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్లు రద్దు చేసే అంశంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం అక్కడి ఫెడరల్ కోర్టుకు తెలిపింది. ఇలా రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో భారతీయులు అక్కడ ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి ట్రంప్ సర్కార్ ఈ విషయం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నా... ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది. హెచ్-4 వీసాదారుల(హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు)కు వర్క్ పర్మిట్ ల ద్వారా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయవచ్చని 2015 అప్పటి ఒబామా సర్కారు నిర్ణయం తీసుకుంది.
అధికంగా నష్టపోయేది భారతీయులే..!
ఈ నిర్ణయం వల్ల తాము ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ కొలంబియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేయకుండా నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే సమీక్షలు జరుపుతున్నామని, మరో మూడునెలల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్(డీహెచ్ఎస్) కోర్టుకు నివేదించింది. ఇకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే ప్రధానంగా భారతీయులపైనే ప్రభావం పడనుంది. 2017 డిసెంబరు 25 నాటికి 1,26,853 మంది హెచ్-4 వీసాదారులకు అమెరికా పని అనుమతులు మంజూరు చేసింది. ఇందులో 93 వాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం. ఐదు శాతం మంది చైనీయులు ఉన్నట్లు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంస్థ ఇటీవల తెలిపింది. అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయంతో హెచ్1-బీ వీసాదారులు ఇక నుంచి వారి ఒక్కరి సంపాదనతోనే అమెరికాలో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.