వణుకుతున్న కోనసీమ ...!!

Update: 2018-12-16 02:30 GMT

తుఫాన్ ఆ పేరు వింటేనే తూర్పు గోదావరి జిల్లా కోనసీమ గజగజలాడుతుంది. గతంలో 1996 లో వచ్చిన పెను తుఫాన్ చేదు జ్ఞాపకాలను కోనసీమ వాసులు నేటికీ మరువ లేకపోతున్నారు. పచ్చని కోనసీమ తుఫాన్ గుప్పెట చిక్కి విలవిల్లాడింది. రెండు దశాబ్దాలు క్రితం వచ్చిన తుఫాన్ దెబ్బనుంచి కోనసీమ కొబ్బరి రైతులు ఇప్పటికి కోలుకోలేదు. తుఫాన్ తరువాత కొబ్బరి దిగుబడి ఆంధ్రా కేరళ గా పేరొందిన ప్రాంతంలో తీవ్రంగా పడిపోయింది. ఇప్పటికి కొబ్బరి నల్లితో వుండే పంట దిగుబడి వస్తూ రైతులు నష్టాల్లోనే వున్నారు. ఇప్పుడు మరో తుఫాన్ రూపంలో విరుచుకుపడుతుందన్న వార్తలు కోనసీమ రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఆనాటి విధ్వంసం తో సర్వనాశనం...

తూర్పుగోదావరి జిల్లా యానాం ఎదుర్లంక నడుమ 1996 లో తుఫాన్ తీరం దాటింది. అంతే నెలరోజుల పాటు కోనసీమ వాసులు చూసిన నరకం అంతా ఇంతా కాదు. తాగునీరు లేదు, విద్యుత్ సరఫరా లేదు, తిండి పెట్టె అన్నదాతలు సైతం తిండి ఎవరు పెడతారా అని అల్లాడిపోయిన రోజులవి. కోనసీమ తుఫాన్ లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. కట్టుబట్టలతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపంతో రంగంలోకి దిగిన చంద్రబాబు నాడు రాజమండ్రి లో మినీ సెక్రెటేరియట్ ఏర్పాటు చేశారు. 10 రోజులకు పైగా ప్రభుత్వం రాజమండ్రి కేంద్రంగా నడిపించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి బాధితుల ప్రశంసలు అందుకున్నారు.

పాఠాలు నేర్చుకొని సర్కార్ ...

కోస్తా ప్రాంతం తుఫాన్ లు, భారీ వర్షాలు, వరదలకు కేంద్ర ప్రాంతం. దివిసీమ ఉప్పెన తరువాత నుంచి తాజా తీతిలి తుఫాన్ వరకు ఎన్నో పాఠాలు నేర్పినా పాలక ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. విధ్వంసం సృష్ట్టించాకా హడావిడి చర్యలు, నష్టపరిహారాలు తప్ప శాస్వీత రక్షణ చర్యలు తీసుకోవడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలపై ఆధారపడ్డం తప్ప ఒడిస్సా, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న స్వీయ రక్షక దళాలను సిద్ధం చేసుకోలేక పోతున్నారు. విద్యుత్ శాఖ పనితీరు ఆధ్వాన్నంగానే ఉంటుంది. రోజుల తరబడి విద్యుత్ సరఫరా అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోస్తా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు నీటి రాతలుగానే మిగులుతున్నాయి.

రాబందుల పాలు......

స్వచ్ఛంద సంస్థలు అందించే అంత వేగంగా విధంగా ప్రభుత్వ యంత్రాంగం మంచినీరు, ఆహరం, పునరావాసం ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోతుంది. తుఫాన్ నష్టపరిహారం రాబందుల పాలు అవుతుంది. తుఫాన్ లు ఇతర ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకోసం పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో అధికారంలో ఎవరు వున్నా వారి పాత్ర మరీ ఎక్కువగా ఉంటుంది. చేసేది తక్కువ ప్రచార ఆర్భాటం ఎక్కువగా మారిపోతుంది. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో తాజా తుఫాన్ కూడా మరో రాజకీయ తుఫాన్ లా మారనుంది ఇప్పటికైనా సర్కార్ మేలుకొని నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వున్న తీరప్రాంత వాసుల రక్షణకు శాస్వీత ప్రాతిపదికన రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు

Similar News