వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజనపై చర్చకు నోటీసులు ఇవ్వాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. 1972లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంపై 1978లో పార్లమెంటులో చర్చ జరిగిన సంగతిని ఈ సందర్భంగా ఉండవల్లి చంద్రబాబుకు గుర్తు చేశారు. గత పార్లమెంటులో జరిగిన విభజనపైన కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చించవచ్చునన్నారు. విభజన జరిగిందని చెబుతున్నా పార్లమెంటు ప్రొసీడింగ్స్ లో ఆ విషయమే లేదని తెలిపారు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యులు కాదు కాబట్టి నోటీసు ఇవ్వవచ్చన్నారు. అలాగే ఏపీ విభజనకు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషప్ పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు తాను టీడీపీ నేతల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.