బ్రేకింగ్ : వాజ్ పేయి మృతి

Update: 2018-08-16 12:11 GMT

భారతదేశ రాజకీయాల్లో భీష్మ పితామహుడు...మూడు సార్లు ప్రధానిగా దేశానికి మహత్తర సేవలు అందించిన అటల్ బిహార్ వాజపేయి కన్నుముశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. గత తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో మృత్యువుతో పోరాడిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల అటల్ జీ మూత్రపిండాల సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. 2004 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2007లో అనారోగ్యం పాలయి ఇంటికే పరిమితమయ్యారు. తర్వాత అల్జీమర్స్ వ్యాధితో మనుషులను గుర్తించే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. జూన్ 11వ తేదీన ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పైన ఉంచారు. ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు.

జీవితాంతం దేశం కోసమే...

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన 23 రోజుల జైలు జీవితం గడిపారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆర్ఎస్ఎస్ తో వాజ్ పేయిది ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం. 1968 జనసంఘ్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఆవిర్భవించిన తర్వాత ఆయన మొదటి అధ్యక్షులు. మొదటిసారి 13 రోజులకు, రెండోసారి 13 నెలలకు ఆయన ప్రధాని పదవిని కోల్పోయినా, మూడోసారి ఆయన పూర్తికాలం కొనసాగి పూర్తి పదవీకాలాన్ని నిర్వర్తించిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. అమెరికా వంటి దేశాలను ఎదిరించి మరీ పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపి భారతదేశ సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన ధైర్యశీలి అటల్ జీ . ఆయన అందించిన స్నేహ హస్తానికి కార్గిల్ యుద్ధం ద్వారా ద్రోహం చేసిన పాకిస్తాన్ కు అంతే ధీటుగా స్పందించి బుద్ధిచెప్పారు. హిందుత్వ పార్టీలో ఆయన పనిచేసినా ఆయన లైకికవాదాన్ని ఏ ఒక్కరూ శంకించలేరు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు శత్రువులు ఉండరనేది ఆయన మాట. అందుకే పాక్ తో భారత్ యుద్ధం గెలిచాక పార్లమెంటు వేదికగా రాజకీయ ప్రత్యర్థి ఇందిర గాంధీని అపర కాళీ మాతగా కీర్తించగలిగే గొప్ప మనస్సు ఆయన సొంతం. అటల్ జీ లోటు దేశానికే కాదు ప్రపంచానికే తీరని లోటు.

Similar News