వాజపేయి మృతిపై కూడా...?

Update: 2018-08-17 03:30 GMT

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి మరణం లోను తెలుగు రాష్ట్రాధినేతలు తలోరీతిన నిర్ణయాలు తీసుకున్నారు. టి సర్కార్ అటల్ కి నివాళిగా శుక్రవారం సెలవు ప్రకటిస్తే ఎపి సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన విధంగానే ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి సరిపెట్టింది. మాజీ ప్రధాని మృతికి సెలవు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు ఎపి సీఎం తనదైన శైలిలో స్పందించారు. అబ్దుల్ కలాం, వాజ్ పేయి వంటివారు అభివృద్ధి ప్రేమికులని మరింతగా పనిచేసి దేశం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. భారత రత్నకు అదే సరైన నివాళి అన్నారు బాబు.

బాబు నిర్ణయం వెనుక ...?

ప్రస్తుతం బిజెపి పై టిడిపి పోరుబాటలో సాగుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు అన్ని రాజకీయాలే నడిచే పరిస్థితి. దాంతో మాజీ ప్రధాని మృతికి సెలవు ప్రకటించడం లోను రాజకీయమే కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో అటల్ మరణానికి సెలవు ప్రకటించడం సరైనది కాదని పార్టీ సీనియర్ల సూచనతో చంద్రబాబు తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. బాబు తన సంతాప సందేశంలో సైతం అటల్ కి ని ఆకాశానికి ఎత్తేశారు. తన నిర్ణయాలను వాజపేయి వ్యతిరేకించినా స్పోర్టివ్ గా తీసుకున్నారని కక్ష సాధింపులకు దిగే వారు కాదని మోడీ ని పరోక్షంగా దెప్పిపొడిచారు. టిడిపి అనుకూల మీడియా లో గోద్రా అల్లర్ల సమయంలో మోడీ ని పదవినుంచి దింపాలని అటల్ కోరుకున్నా అద్వానీ అడ్డం పడడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారంటూ ప్రముఖంగా కథనాలు వెలువడటం విశేషం.

కెసిఆర్ సెలవు అందుకేనా ...?

ప్రస్తుతం టి సీఎం కెసిఆర్ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సఖ్యతగా సాగుతున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ సిఎం కేసీఆర్ ను పొగిడితే, కెసిఆర్ మోడీని అభినందిస్తున్నారు. ఇలా ఇద్దరి జోడి సక్రమంగా సాగుతున్న నేపథ్యంలో వాజ్ పేయి మృతిపై కెసిఆర్ ఘన నివాళి అర్పించాలని నిర్ణయించారు. అందులోభాగంగానే సెలవును ప్రకటించడం తో బాటు సంతాపదినాలు అమలు చేయనున్నారు.

Similar News