వంగవీటి పోటీపై క్లారిటీ ఇచ్చిన జగన్...!!

Update: 2018-10-22 10:30 GMT

విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా ఎపిసోడ్ పై నేతలకు వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. వంగవీటి రాధకే తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్లు జగన్ బందరు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. అలాగే బందరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బాలశౌరిని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు.

రాధా ఎటూ తేల్చకపోవడంతో...

నిజానికి రాధాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు జగన్. ఒకటి బందరు పార్లమెంటు నుంచైనా, లేక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచైనా పోటీ చేయవచ్చని జగన్ రాధాకు సూచించారు. అయితే రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపైనే కన్నేశారు. తనకే సెంట్రల్ సీటును కేటాయించాలని పట్టుబడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించి ఇరవై రోజులు గడుస్తుంది. అప్పటి నుంచి రాధా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. తన అనుచరులతో సమావేశాల పేరుతో హడావిడి చేసిన రాధా తర్వాత మౌనంగానే ఉన్నారు.

బందరు పార్లమెంటు నుంచి బాలశౌరి.....

దీంతో బందరు పార్లమెంటు విషయంపై రాధా స్పష్టత ఇవ్వకపోవడంతో జగన్ దానిని బాలశౌరికి కేటాయిస్తున్నట్లు బందరు పార్లమెంటు నియోజకవర్గం సమీక్షలో వెల్లడించడం విశేషం. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రాధా పోటీ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తి కరంగా మారింది. తాను సెంట్రల్ నుంచే పోటీ చేయాలని రాధా పట్టుదలతో ఉండటం, జగన్ సమావేశంలో రాధాకు తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో రాధా పార్టీ నుంచి వెళ్లి వేరే పార్టీ తరుపున సెంట్రల్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే జగన్ చెప్పినట్లు తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. మొత్తం మీద బంతిని రాధా కోర్టులోకే నెట్టేశారు జగన్.

Similar News