రగులుతున్న రాధా...పట్టించుకోని జగన్....!

Update: 2018-09-18 06:30 GMT

విజయవాడ సెంట్రల్ సీటు వివాదం హీటెక్కుతోంది. వంగవీటి రాధాను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కన్పిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా రాధాను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సంచలనం కల్గిస్తోంది. మరోవైపు మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయ కర్తగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో రాధా తన అనుచరులతో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు.

సెంట్రల్ సీటుపై.....

విజయవాడ సెంట్రల్ సీటుపై రాధా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రాధాను మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా పంపాలని అధిష్టానం దాదాపు నిర్ణయం తీసుకుంది. దీంతో రాధా వర్గం రగలి పోతోంది. గత కొన్నాళ్లుగా విజయవాడ సెంట్రల్ సీటు విష‍యంలో మల్లాది విష్ణు, వంగవీటి రాధాల మధ్య వివాదం తలెత్తింది. అయితే రాధా మాత్రం సెంట్రల్ నియోజకవర్గం సీటు తనకే ఇస్తారని రాధా నమ్మకం పెట్టుకున్నారు.

మల్లాది విష్ణుకే......

దీంతో అధిష్టానం రెండురోజుల క్రితం గడపగడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించే బాధ్యతలను సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు అప్పగించారు. దీంతో రాధా వర్గీయులు ఆందోళనకు దిగారు. ఒకరు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే రాధా మాత్రం ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, జగన్ తనకే టిక్కెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని అనుచరులకు రాధా సర్ది చెప్పారు. కానీ మంగళవారం సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలను మల్లాదికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాధా తన అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాధా వర్గం ఆందోళనలు చేస్తున్నా రాధాను బుజ్జగించేందుకు అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడమూ రాధా వర్గీయుల ఆగ్రహానికి కారణమయింది.

Similar News