వసంత కు ఒక్కసారి ఛాన్స్ మాత్రమేనా?

వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో గడ్డు పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోఆయన వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు.

Update: 2022-01-05 04:38 GMT

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచినా మొన్నటి వరకూ వసంత కోరిక నెరవేరలేదు. పార్టీలు మారినా ఫలితం దక్కలేదు. కానీ 2019 ఎన్నికలు ఆయన కోరికను తీర్చాయి. అయినా స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. తనకు వచ్చిన ఆధిక్యత ఎంత? దానికి కారణం ఎవరు అని వసంత కృష్ణ ప్రసాద్ కు తెలియంది కాదు. అన్నీ లెక్కలతో సహా ఆయన దగ్గర పెట్టుకుని మరీ రాజకీయం చేసే వ్యక్తి.

అందరూ సపోర్టు....
వసంత కృష్ణ ప్రసాద్ స్వతహాగా బిల్డర్. హైదరాబాద్ లో పెద్దపెద్ద వెంచర్లు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. ఇక రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని భావించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ కు ఆ సామాజికవర్గం కూడా గత ఎన్నికల్లో అండగా నిలిచింది. దేవినేని ఉమపై కోపంతో ఆయనకు మద్దతు తెలిపింది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజికవర్గాలు కూడా సపోర్టు చేయడంతో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు సాధ్యమయింది.
మైలవరంలో గడ్డు పరిస్థితిని....
అయితే ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో గడ్డు పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనూ, సామాజికవర్గంలోనూ ఆయన వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఇందుకు కొండపల్లి మున్సిపల్ ఎన్నిక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇప్పడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు పడటం లేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన వర్గం ఇప్పటికీ మైలవరం లో ఉంది. 2019 ఎన్నికల్లో ఆయనను పెడనకు పంపారు. దీంతో ఇప్పటికీ మైలవరంలో జోగి రమేష్ కెలుకుతుండటం వసంత కృష్ణ ప్రసాద్ కు కోపం తెప్పిస్తుంది.
కమ్మతో పాటు బీసీలను...
దీంతో పాటు మైలవరం పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. వసంత తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈయన జోగి రమేష్ మనిషి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. దీంతో అధిష్టానం ఎటూ తేల్చి చెప్పలేకపోతుంది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ కు వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాలు ఇబ్బంది కల్గిస్తాయని చెప్పకతప్పదు. ఒకవైపు సొంత సామాజికవర్గంలో అసంతృప్తి, పార్టీలో విభేదాలు వసంత విజయానికి అడ్డుకట్ట వేస్తాయంటున్నారు. దేవినేని ఉమకు ఇది కలసి వచ్చే అంశంగానే చెప్పాలి.


Tags:    

Similar News