పదివేలరూపాయలు అప్పువుంటే కొంపాగోడు అమ్మేసి వడ్డికి సరిపోకపోతే మనిషిని కూడా అమ్మేంత వత్తిడి తెస్తాయి ఇండియన్ బ్యాంక్ లు. కానీ ఇవన్నీ సామాన్యుల విషయంలోనే అన్నది అందరికి తెలిసిందే. అదే దేశ ఆర్ధిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులను కుదిపేసే దొంగల విషయంలో మాత్రం రెడ్ కార్పెట్ పరిచి విదేశాలకు సైతం పారిపోయేలా వీసాలు ఇచ్చేసే వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు. అది విజయ మాల్యా కావొచ్చు, నీరవ్ మోడీ కావొచ్చు. ఇలా దర్జాగా దేశంలోని బ్యాంకింగ్ మోసాలకు పాల్పడి విదేశాలకు వెళ్ళి తలదాచుకున్న వారు వెనక్కి రమ్మంటే గొంతెమ్మ కోర్కెలు కోరుతుండటం దానికి అక్కడి చట్టాలు, న్యాయ వ్యవస్థ తానా అంటే తందానా అనడం అందరి దౌర్భాగ్యం గా మారింది. తాజాగా విజయమాల్యా ను లండన్ నుంచి రప్పించేందుకు సిబిఐ ఇప్పుడు ఇంగ్లాండ్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలిసి వస్తుంది.
జైలు సౌకర్యాలు చూడండి...
భారత్ లోని జైళ్లల్లో సౌకర్యాలు సరిగ్గా ఉండవని కనుక లండన్ లోనే తనను విచారించుకోవాలంటూ విజయమాల్యా అక్కడ కేసు దాఖలు చేసిన అంశం అందరికి తెలిసిందే. దానిపై ఇండియా లో మాల్యాను నిర్బంధించే జైలు వివరాలు, వీడియోలతో సహా కావాలని ఇంగ్లాండ్ కోర్టు ఆదేశించింది. దీనిపై సిబిఐ ముంబాయి లోని ఆర్థర్ జైలు వీడియో ను ఇంగ్లాండ్ కోర్ట్ కి పంపింది. ఇక్కడి జైలులో గాలి వెలుతురు, లైబ్రెరీ, టివి అన్ని సౌకర్యాలను వీడియో లో పొందుపరిచింది. బ్యారక్ లో ఆరుగురు చొప్పున ఉంచుతామని వివరించింది. బ్యారక్ నెంబర్ 12 ను మాల్యా కోసం కేటాయిస్తున్నట్లు అందులో ప్రత్యేక బెడ్, టాయిలెట్, సౌకర్యాలు వెల్లడించింది. ఆరు నుంచి 8 నిమిషాల వీడియో ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం యుకె కోర్ట్ కి సబ్ మిట్ చేసింది. మరి ఈ వీడియో పై అక్కడి కోర్ట్ ఎలా స్పందిస్తుంది లిక్కర్ కింగ్ మాల్యా భారత్ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూడటమే మిగిలింది.