విజయశాంతి... షాకింగ్ డెసిషన్ తీసుకుంటారా....?

Update: 2018-09-12 07:30 GMT

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె గత కొంతకాలంగా మౌనాన్ని పాటిస్తున్నారు. అయితే ఆమె తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ ఆమె మాత్రం మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా విజయశాంతిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమె వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్న అభిప్రాయంలో ఉన్నారు.

యాక్టివ్ అవ్వాలని......

విజయశాంతి తిరిగి కాంగ్రెస్ లో యాక్టివ్ కాకపోవడానికి ప్రధాన కారణం తనకు పార్టీలో కీలక పదవి ఇవ్వలేదన్న కారణమేనని ఆమె సన్ని:హిత వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ విజయశాంతికి పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగిస్తారని ప్రామిస్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. కాని కాంగ్రెస్ నేతలు ఆ పదవికి విజయశాంతి వద్దని అభ్యంతరం తెలపడంతో పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించినా ఆమె కన్పించలేదు.

టీడీపీతో పొత్తుపై......

ఇక తాజాగా విజయశాంతి ఈనెల 15వ తేదీ తర్వాత తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని ఆమె గాంధీభవన్ కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఇష్టపడటం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని విజయశాంతి అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పేందుకు ఆమె రెడీ అయినట్లు తెలుస్తోంది. టీడీపీతో కలసి వెళితే విజయశాంతి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News