ఎందుకు ఈయననే టార్గెట్ చేశారు...??

Update: 2018-12-30 08:00 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ ను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలే టార్గెట్ చేస్తున్నారు. వివేక్ గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సోదరుడు వినోద్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం ఇందుకు అంగీకరించలేదు. దీంతో వినోద్ బెల్లంపల్లి నుంచి స్వతంత్ర అభర్థిగా బరిలోకి దిగారు. ఒక్క వినోద్ విషయంలోనే కాదు వివేక్ టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించడానికి ప్రత్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే అప్పుడు తమ తడాఖా చూపిస్తామని సవాల్ విసురుతుండటం విశేషం.

కోవర్టులపై చర్యలు తీసుకోవాలంటూ....

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు పార్టీలో ఒక రకంగా చిచ్చురేపాయనే చెప్పాలి. శాసనసభ ఎన్నికలలో కోవర్టులుగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ విన్పిస్తోంది. ఇందులో ముఖ్యంగా మాజీ ఎంపీ వివేక్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా, పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థి ని ఓడించాలని కొందరు కుట్రలు పన్నారంటున్నారు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. గెలిచిన ఎమ్మెల్యేలు సయితం తమ మెజారిటీ తగ్గడానికి కారణం కోవర్టులేనని బాహాటంగా చెబుతున్నారు.

ప్రత్యర్థులకు సహకరించారని.....

ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో ఈ తరహా విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం విషయానికొస్తే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరి తృటిలో ఓటమిని తప్పించుకున్నారు. స్వల్ప మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ బయటపడినా ఇందుకు ప్రధాన కారణం వివేక్ అని వారు వాదిస్తున్నారు. వివేక్ ఇచ్చిన డబ్బులతోనే కొందరు టీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచారంటున్నారు. వివేక్ పై చర్యలు తీసుకోవాలంటే టీఆర్ఎస్ జిల్లా ఇన్ ఛార్జి బస్వరాజు సారయ్యను అక్కడి నేతలు కోరడం విశేషం.

అధిష్టానానికి ఫిర్యాదులు.....

ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్షలుచేసుకుంటున్నారు. మెజారిటీ తగ్గడానికి కారణాలు కొందరు,ఓటమి బాట పట్టడానికి కారణాలు ఏంటన్న దానిపై విశ్లేషించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కోవర్టుల విషయం బయటకు వచ్చింది. మంథని నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలు కూడా వివేక్ పై మండిపడుతున్నారు. పుట్టా మధు ఓటమికి వివేక్ కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామగుండంలోకూడా వివేక్ పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కాదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్ కు మద్దతిచ్చి ఆయనను ఆర్థికంగా సహకరించారని ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లిలోనూ ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య ఇదేరకమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు ముగిసన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివేక్ పై టీఆర్ఎస్ నేతలు దాడిని పెంచారు. మరి గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Similar News