Summer Effect : ఇవేం ఎండలు రాబాబు.. కింద మంట పెట్టినట్లుందిగా
ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.;

ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నలభై ఐదు డిగ్రీలు ఈ నెలలోనే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అస్సలు ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చినా నిప్పుల మీద ఉన్నట్లు భావన కలుగుతుంది. పెనం మీద ఉన్నట్లుగానే అనేక మంది ఫీలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలోని దాదాపు ఇరవై జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చినా ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే బయటకు రావాలని కోరింది.
ఏప్రిల్, మే నెలలో...
మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఇంత ఎక్కువగా ఉండటంతో ఇక ఏప్రిల్, మే నెలలో ఏ స్థాయిలో ఉంటాయో అని ఊహించుకుంటేనే శరీరం చెమటలు కక్కుతుంది. ఎందుకంటే ఈ ఏడాది రోహిణి కార్తెలో యాభై డిగ్రీలు దాటే అవకాశముందని కూడా భావిస్తున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఒక్కసారిగా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు మరింత రోగాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు జలుబు, దగ్గు వంటి వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ తో పాటు ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువయిందని వైద్యులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండల్లో తిరిగితే వడదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు.
రానున్న రోజుల్లో...
ఈ ఎండాకాలం గుండె పోటు మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. ఎక్కువ మంది గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక తాజాగా వాతావరణ శాఖ ఎండలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. తేమ లేకపోవడంతో నాలుక పిడచకట్టుకపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో 181 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అనేక మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌లో మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపారు. తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.