Chandrababu : ఏపీలో పేదల ఇళ్లలో నిజమైన ఉగాది నేటి నుంచే
ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనున్నారు. జీరో పావర్టీ పీ 4 పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు;

ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనున్నారు. జీరో పావర్టీ పీ 4 పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఉగాది రోజున ఈ పథకం ప్రారంభించి పేదల ముఖాల్లో నవ్వులు విరబూయాలని ప్రయత్నంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. చంద్రబాబు కు అత్యంత ఇష్టమైన పథకమిది. ఆయన రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో పెద్ద పనికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పేదలందరికీ కనీస అవసరాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించి పీ4 పథకాన్ని డిజైన్ చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా అధికారుల వెంట పడిన చంద్రబాబు వారికి ఏమేం చేయాలో అన్నీ సవిరంగా తెలియజెప్పారు.
పేదలను గుర్తించి...
ప్రతి జిల్లాలో ఉన్న పేదలను ముందుగా గుర్తించి వారి కనీస సమస్యలను తొలగించే పనికి నేటి నుంచి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ పై చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఏ విషయంలో పిలుపు ఇచ్చినా అందుకు రెస్పాన్స్ భారీగానే వస్తుండటంతో ఈ పథకానికి కూడా అంతకు మించి వస్తుందని అంచనా వేస్తున్నారు. మహిళలు, గ్రామీణ ప్రజలను పీ4లో ప్రధాన భాగస్వాముల్ని చేయాలని, దీని అమలులో పారదర్శకత, విధాన రూపకల్పన అవసరమని చంద్రబాబు గట్టిగా నిర్ణయంచారు. అంతే కాదు పారిశ్రామికవేత్తలతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు వారికి పథకం గురించి చెప్పి ఒప్పించడంలో సఫలమయ్యారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి...
ఇందులో పారిశ్రామికవేత్తలు,కోటీశ్వరులు, ఎన్ఆర్ఐలతో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యులను చేయనున్నారు. అమరావతికి సమీపంలోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. తొలి దశలో ఇరవై లక్షల మంది పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోనున్నారు. తర్వాత దశల వారీగా పేదలను గుర్తించడం, వారికి చేయూతనివ్వడం వంటివి చేస్తారు. స్వర్ణాంధ్ర -2047 విజన్ పది సూత్రాల అమలులో భాగంగా ‘జీరో పావర్టీ-పీ4’ను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనుంది. ఆపన్నహస్తం సహాయ సహకారాలతో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి పేదల ఇళ్లలో వెలుగులు నింపే కార్యక్రమానికి నేడు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.