మూడ్ ఆఫ్ ద ఏపీ ఏమిటి?
'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట వెలువడిన అంచనాలతో వైసీపీ వ్యతిరేక శక్తులు చంకలు గుద్దుకుంటున్నవి
మూడ్ ఆఫ్ ద ఏపీ ఏమిటి?
SK.ZAKEER
'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట వెలువడిన అంచనాలతో వైసీపీ వ్యతిరేక శక్తులు చంకలు గుద్దుకుంటున్నవి.ఏపీలోని 25 లోక్ సభ స్థానాలలో 15 స్థానాలు టీడీపీ కూటమికి రావచ్చునన్నది ఇండియా టుడే,సీ ఓటర్ సంస్థలు స్థూలంగా చెప్పిన అభిప్రాయం.25 లో 24 వరకు జగన్ మళ్ళీ గెలుచుకునే అవకాశాలపై 'టైమ్స్ నౌ' కొద్ది రోజుల కిందట ఒక సర్వేలో తెలిపింది.టీడీపీ,దాని మద్దతుదారులంతా ఆ సర్వే బూటకమనీ,పెయిడ్ సర్వేలనీ దుమ్మెత్తిపోశారు.
లోక్ సభ ఎన్నికలకు కనీసం 8 నెలలకు పైగా సమయం ఉండగా ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా అది 'అంచనా' మాత్రమే.'ప్రజభిప్రాయం' కాదు.అంచనాలకు,ప్రజాభిప్రాయానికి చాలా తేడా ఉన్నది.ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత,కూటముల ఏర్పాట్లు,పొత్తులు,సీట్ల సర్దుబాటు వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యాక మాత్రమే సర్వేలకు విశ్వసనీయత ఉంటుందని నా నమ్మకం.నాతో విబేధించేవాళ్ళు ఉండవచ్చు.అంగీకరించేవాళ్ళు ఉండవచ్చు.అది వేరే సంగతి.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సిపి,టిడిపి,జనసేన ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నవి.జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ,కమ్యూనిస్టులు నామమాత్రంగా మిగిలిపోయినవి. 2014 ఎన్నికల్లో ప్రజలు టిడిపికి అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ + టీడీపీ + జనసేన కూటమిలో ఉన్నవి.జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఒక చారిత్రక తప్పిదం.బీజేపీ ప్రభుత్వం అధికారంలో వస్తే ప్రతేక్యహోద ఇస్తాం అని చెప్పి, ప్రతేక్య ప్యాకేజీ అని మాట మార్చారు.టీడీపీ,జనసేన కూడా అదే బాటలో నడిచాయి.మొదటి సంవత్సరంలో ఏపీకి ప్రతేక్యహోద అవసరం అని చెప్పారు.తరవాత స్పెషల్ ప్యాకేజీ అవసరమని చెప్పుకుంటూవచ్చారు. ఇలా మాట మార్చుతూ వచ్చారు.ఈ మార్పు ప్రజల సంక్షేమం కోసమో,లేకపోతె రాజకీయ లబ్ది కోసమో ప్రజలకు అర్ధమయ్యింది.
2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో వైస్సార్సీపీ సునామీ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఘన విజయంగా జగన్ నమోదు చేసుకున్నారు.టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది.మార్పు నినాదంతో ఎన్నికల బరిలోకి వచ్చిన జనసేన పార్టీ ఓకే ఒక స్థానంలో చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది.జనసేన తరఫున రాపాక వరప్రసాద్ రాజోలు నుంచి గెలుపొందారు.ఆయన ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు.
సరే... లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసే అంశాలు,వాటిని ప్రభావితం చేసే విషయాలు వేర్వేరుగా ఉంటాయి.అందుకే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట నిస్సందేహంగా లోక్ సభ స్థానాలు కూడా ఆయా పార్టీలే గెలుస్తూ వస్తున్నట్టు చరిత్ర,వర్తమానం చెబుతున్నవి.తమిళనాడు,ఏపీ,తెలంగాణ వంటి రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇందుకు రుజువు.జాతీయ స్థాయి రాజకీయాల ప్రభావం,ప్రధానమంత్రి ఎవరవుతారనే అంశం ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపవు.అయినా ప్రధాని మోడీ ఇమేజ్ తదితర అంశాలు కొన్ని రాష్ట్రాలలో ఖచ్చితంగా పనిచేస్తున్నవి.
విద్య,వైద్యం,ఆరోగ్యం,సంక్షేమ రంగాలలో జగన్ మోహనరెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో జగన్ సంక్షేమ పాలన వాయువేగంతో దిశగా దూసుకుపోతుంది.2024 ఎన్నికల్లోనూ జగన్ ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని అంచనా వేస్తున్న వాళ్ళు ఉన్నారు.ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుతోందని,జగన్ సర్కారు పతనం ఖాయమని,చంద్రబాబు + పవన్ + బీజేపీ కూటమి విజయం దిశగా పయనిస్తున్నాయని టీడీపీ,జనసేన నమ్ముతున్నవి.ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో ఆగస్టులో అంచనా వేయడం శాస్త్రీయం కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, విజయాలు ప్రజల ముంగిట ఉన్నవి. పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించింది.'నాడు-నేడు' కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నవి.కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నవి.విద్య, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పునరుద్ధరణ వల్ల జరుగుతున్న ప్రయోజనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పౌరుల సంక్షేమం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది.కొన్ని విమర్శలు, వివాదాలు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినందుకు ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రశంసలు అందుతున్నవి.
తెలుగుదేశం,జనసేన పార్టీలు 2019 లో చేసిన వ్యూహాత్మక తప్పిదమే మళ్ళీ చేస్తున్నవి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై బురద చల్లడం వంటి చర్యలకు ప్రజల నుంచి ఆమోదం లభించడం లేదు.ప్రజలకు అందించవలసిన ప్రాథమిక సేవలను మెరుగుపరచడం, అవినీతిని తగ్గించడం అనే లక్ష్యంతో పౌరులకు ప్రభుత్వ సేవలు, పథకాలను వారి ఇంటి వద్దే అందించడానికి ప్రభుత్వం గ్రామ స్థాయిలో వాలంటీర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద సంచలనం.వలంటీర్ల పనితీరుపై నిందల మాట ఎలా ఉన్నా,జగన్ అవినీతి,భూ కబ్జాలు,కుంభకోణాలు అంటూ ఆరోపణలు గుప్పించడం,జగన్ క్రిమినల్ అనీ,రాక్షస పాలన నడుస్తోందని విపక్షాలు చేసే ప్రచారం ఫలించేలా కనిపించడం లేదు.
పాలన పగ్గాలు చేపట్టిన వాళ్ళ అవినీతి,ఇతరత్రా కుంభకోణాలను పట్టించుకునే పరిస్థితిలో సాధారణ ఓటర్లు లేరు.తమ దైనందిన జీవితంలో కలుగుతున్న ప్రయోజనాలు,తమ కొనుగోలు శక్తి పెరుగుతున్న పరిస్థితులు... వంటి అంశాలకు మాత్రమే ఓటర్లు ప్రాధాన్యమిస్తారని పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది.జగన్ 16 నెలల పాటు వివిధ కేసుల్లో నిందితునిగా జైలులో గడిపి వచ్చినట్టు ప్రజలందరికీ తెలిసినా ఆయనకే పట్టం కట్టడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి? 'మార్పు' పేరిట రాజకీయ రణరంగంలో దూకిన పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల ప్రజలు తిరస్కరించడం దేనికి సంకేతం?
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)