జగన్‌కి వార్నింగ్ బెల్..?

ఈ ఎన్నికల్లో కేసీయార్‌ పరాజయం అనూహ్యమేమీ కాదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో (దాదాపు 75 శాతం) కేసీయార్‌ అధికార పీఠాన్ని సాధికారికంగా కైవసం చేసుకున్నారు. 47 శాతం ఓట్లతో ఘన విజయాన్ని తెరాస (నేటి భారాస) నమోదు చేసింది. ఆ తర్వాత నుంచి తెలంగాణ జనం భారాసను హెచ్చరిస్తూనే ఉన్నారు.

Update: 2023-12-04 03:11 GMT

 డబ్బు పంపకమే పాలన కాదు

ఈ ఎన్నికల్లో కేసీయార్‌ పరాజయం అనూహ్యమేమీ కాదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో (దాదాపు 75 శాతం) కేసీయార్‌ అధికార పీఠాన్ని సాధికారికంగా కైవసం చేసుకున్నారు. 47 శాతం ఓట్లతో ఘన విజయాన్ని తెరాస (నేటి భారాస) నమోదు చేసింది. ఆ తర్వాత నుంచి తెలంగాణ జనం భారాసను హెచ్చరిస్తూనే ఉన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన ఓట్‌ షేర్‌ను, సీట్లను ఆ పార్టీ భారీగా కోల్పోయింది. హుజార్‌నగర్‌, దుబ్బాక ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇవి భారాస నియంతృత్వ పోకడలపై తెలంగాణ వాసుల తొలి తిరుగుబాటు.

కేసీయార్‌ జనానికి దూరంగా ఉంటారు. సచివాలయానికి రారు. ఫాం హౌస్‌లోనే కాలం గడుపుతారు. పార్టీకి కేటీయార్‌, హరీష్‌ రావు, కవిత తప్ప వేరే దిక్కు లేకుండా పోయింది. తామెన్నుకున్న ముఖ్యమంత్రి తమకు అందుబాటులో లేకపోయారనే అసంతృప్తి జనంలో పెరిగిపోయింది. ఇతర నేతలు కూడా పరనింద, ఆత్మస్తుతిలోనే కాలం గడిపారు. ప్రచారార్భాటాలకు కొదువ లేదు. జనంలో ఉన్న ఆగ్రహావేశాలను, అసంతృప్తిని భారాస అంచనా వేయలేకపోయింది. జీతాలు సరైన సమయంలో రాకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న చిరాకు, ఉద్యోగ నియామకాల్లో అవినీతి, అలసత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న కోపాన్ని తెరాస సర్కార్‌ లైట్‌ తీసుకుంది. తాము భారీగా చేపడుతున్న సంక్షేమ ఫలితాలపై అపార విశ్వాసం, భారాస ఓటమికి కారణమైంది.

మరో ఆర్నెళ్లలోపే ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ చాలా పాఠాలు నేర్పిస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు వచ్చినప్పుడు మాత్రమే జనానికి జగన్‌ కనిపిస్తారు. ప్రజలతో ఆయనకు డైరెక్ట్‌ లింక్‌ లేదు. కేసీయార్‌తో వచ్చిన సమస్య కూడా ఇదే. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. జీతాలు సరైన టైంకి రావడం లేదు. నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తి తీవ్రంగా పేరుకుపోయింది. రెండు లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. కానీ ప్రతీ ఏడాది వేల సంఖ్యలో నిరుద్యోగులు తయారవుతున్నారు. ఉపాధి కోసం వాళ్లు హైదరాబాద్‌ లాంటి నగరాలకు వలస పోతున్నారు. 

ఎన్నికల ముందు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేస్తే సరిపోదు. జనం అంతా గమనిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడికే దిక్కూ దివాణం లేదు. ఓడించి, ఇంటికి పరిమితం చేశారు. తెలంగాణలో సింహ భాగం మీడియా కేసీయార్‌కు అనుకూలంగానే ఉంటుంది. అయినా భారాసకు భంగపాటు తప్పలేదు.. ఆంధ్రలో పెద్ద మీడియా సంస్థలన్నీ జగన్‌కు  వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. జనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 2019 జగన్‌పై పాజిటివ్‌, చంద్రబాబు నెగటివ్‌ల సమ్మేళనం. ఇప్పుడు జగన్‌ పాజిటివ్‌ ఓట్‌తోనే గెలవాలి. వైకాపాకి ఇది మేల్కొనాల్సిన సమయం. లేదంటే చెల్లించక తప్పదు భారీ మూల్యం. 

Tags:    

Similar News