2014 రిజల్ట్ రిపీట్ అవుతుందా?
బీజేపీ కలసి వచ్చినా రాకున్నా 2024 ఎన్నికలకు పొత్తు కన్ఫర్మ్ అయింది. బీజేపీ కోర్టులో పవన్ కల్యాణ్ బంతి విసిరారు.
ఈ కలయిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని బయటకు చెప్పుకోవచ్చు. ప్రభుత్వంపై పోరాటానికే పరిమితమని చెప్పవచ్చు. కానీ నమ్మేవారు ఎవరూ ఇక్కడ లేరు. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా టీడీపీ, జనసేన కలసి ముందుకు వెళతాయన్న క్లారిటీ అయితే వచ్చేసింది. పవన్ కల్యాణ్ కు జరిగిన అవమానంపై చంద్రబాబు ఈరోజు స్పందించారు. గతంలో చంద్రబాబును తిరుపతి విమానాశ్రయం నుంచి వెనక్కు పంపినప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబు వద్దకు వచ్చి ఎందుకు పరామర్శించలేదు. అప్పుడు కూడా అదే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఖూనీ అయింది కదా? అంటే మాత్రం సమాధానాలుండవు.
కలవాలనుకున్నారు...
ిఇద్దరూ కలవాలనుకున్నారు. కలిశారు. అందులో ఎవరూ తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఇద్దరూ కలిసి పోటీ చేయడానికి కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునే హక్కు ఉంటుంది. రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకుంటారు. రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ఆ స్వేచ్ఛ ఉంటుంది. తెంచుకుంటారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరు అడిగారని బీజేపీతో పొత్తు కుదుర్చుకోమన్నారు. బీజేపీ పట్టుబట్టిందా? లేక జనసేన వెళ్లి పొత్తుకు సిద్ధపడిందా? అంటే ఇటీవలే జరిగిన సంఘటనకు అందరం ప్రతక్ష్య సాక్షులమే. దానికి వేరే జవాబు చెప్పాల్సిన పనిలేదు.
బీజేపీతో ...
ఇప్పుడు కూడా అంతే. టైం వచ్చింది. కలిశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా సంకోచం లేదు. వైసీపీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి వెనక్కు పంపినప్పడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే గుర్తుకు వస్తాయి. అందుకు టీడీపీ, జనసేన, వైసీపీ ఏ పార్టీ మినహాయింపు కాదు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం పార్టీల నైజమే. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రసంగాలు చేసిన పవన్ కల్యాణ్ హడావిడిగా కమలం పార్టీతో కరచాలనం ఎందుకు చేశారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.
బంతి బీజేపీ కోర్టులోనే...
బీజేపీ కలసి వచ్చినా రాకున్నా 2024 ఎన్నికలకు పొత్తు కన్ఫర్మ్ అయింది. బీజేపీ కోర్టులో పవన్ కల్యాణ్ బంతి విసిరారు. నిర్ణయించుకోవాల్సింది ఇక బీజేపీనే. టీడీపీతో కలసి పనిచేసేందుకు ముందుకు వస్తే ఓకే. లేకుంటే తెగదెంపులకు రెడీ అయిపోయినట్లే. అయితే సీట్ల పంపకం జరగలేదు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్నది ఖరారు కాలేదు. మిగిలిదంతా సేమ్ టు సేమ్. 2014 లో జరిగిన రాజకీయ పరిణామాలే పదేళ్ల తర్వాత రిపీట్ కాబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే పొత్తులతో ఎవరికి ఉపయోగం? ఎవరికి నష్టం? అన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాలు నేటి నుంచి మరింత హీటెక్కబోతున్నాయన్నది వాస్తవం.