ఎవరితో ఎవరికి అవసరం గురూ?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్న దానిపై చర్చ జరుగుుతంది
ఎవరిదో ఎవరికి పొత్తు అవసరం. భవిష్యత్ రాజకీయాల కోసం పొత్తులు అవసరమా? లేకపోతే ఒకేఒక్కసారికోసం అలయన్స్ లు పెట్టుకుంటారా? ఏ పార్టీ అయినా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదగడం కోసమే ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది. చిన్న పార్టీ మొదలు కొని జాతీయపార్టీలన్నీ ఇలానే ఆలోచిస్తాయి. జేడీఎస్ తనకు పట్టున్న కొద్ది ప్రాంతంలోనైనా ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి స్థానం అందుకోగలిగింది. పశ్చిమ బెంగాల్ లోనూ మమత బెనర్జీ కష్టపడి, ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన తర్వాత కాని తృణమూల్ కాంగ్రెస్ కు విజయం దక్కలేదు. అంతెందుకు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఒంటరిగానే పొరుగున ఉన్న తెలంగాణలో తొలిసారి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఎన్నికలు పూర్తయిన వెంటనే...
కానీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పరిస్థితి ఎటూ అర్థం కాకుండా ఉంది. 2019 ఎన్నికల ఫలితాలు రాగానే వెంటనే పొత్తుకోసం ఢిల్లీకి పరుగులు పెట్టిందెవరు? ఎన్నికలు పూర్తయిన వెంటనే నాడు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకోమని చెప్పారు? ఎవరూ అడగకుండానే జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఏపీలో జనసేన అవసరం తనకూ ఉంది కాబట్టి పవన్ కల్యాణ్ తో కమలం పార్టీ స్నేహహస్తం అందించింది. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా పొత్తుల అవసరం లేదు. పెట్టుకుంటే టీడీపీ, వైసీపీలతో పొత్తుకుంటే ఎంతో కొంత రాజకీయంగా లబ్ది పొందే వీలుంది. కొన్ని సీట్లు తమ ఖాతాలో వేసుకోవచ్చు. కానీ జనసేనతో పొత్తు పెట్టుకోవడమంటే సొంతంగా ఎదగాలనే నాడు కేంద్ర నాయకత్వం జనసేనతో పొత్తుకు అంగీకరించింది.
సొంతంగా ఎదిగేదెప్పుడు?
బీజేపీ ఎప్పుడూ అంతే. సొంతంగా ఎదగాలని చూస్తుంది. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఏమీ లేని చోట నుంచి ఏదో కొంత బలాన్ని సంపాదించుకున్నారు. అక్కడ అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోగలుగుతున్నారు. రేపు ఎన్నికల్లో తెలంగాణలో ీీబీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని అని లెక్కలు వేసుకునేకంటే ఇప్పుడు మాత్రం అధికార టీఆర్ఎస్ ను బలంగా ఢీకొంటుంది బీజేపీయేనే. దానిని ఎవరూ కాదనలేరు. కాంగ్రెస్ ను వెనక్కునెట్టి బీజేపీ ముందుకు రావడం వెనక ప్రజల్లో నమ్మకం కలిగించడమే. ఏపీలోనూ అంతే. ఇప్పుడు కాకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు ఏపీలోనూ బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలన్నది కేంద్ర నాయకత్వం భావన. తెలంగాణలో సక్సెస్ అయితే వెంటనే మిషన్ ను ఏపీలో ప్రారంభిస్తారు.
ఇలా అయితే ఎప్పటికీ....
అయితే పవన్ కల్యాణ్ కు మాత్రం అలాంటి ఆలోచన లేనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చినట్లు కాదు. కేవలం వైసీపీని ఓడించేందుకు ఉపయోగపడితే పడొచ్చు. ఆయనంతట ఆయన అధికారంలోకి రావాలంటే టీడీపీతో పొత్తు ప్రమాదకరమని తెలిసినా ఆయన మొండిగా ముందుకు పోతుంది జగన్ పై ఉన్న కోపమే. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు పనిచేయవు. అలాగే ఎవరూ శాశ్వతంగా శత్రువులుండరు. తడవ తడవకీ స్టాండ్ మారుస్తుంటే పవన్ రాజకీయంగా జనంలో నమ్మకం కోల్పోయే అవకాశముంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈసారి గెలవొచ్చు. తన పార్టీలో పది మందికి మంత్రి పదవులు ఇప్పించుకోవచ్చు. అంత మాత్రాన జనసేన క్షేత్రస్థాయిలో ఎదిగినట్లు కాదు. కష్టపడి... పార్టీని బలోపేతం చేసి ఎదురు చూస్తే ఎప్పటికైనా ఏపీలో పవన్ తన అనుకున్న గోల్ ను చేరుకోగలరు. ఇలా ఐదేళ్లకొకసారి పార్టీలను తరచూ మారుస్తూ ప్రజల ముందుకు వెళితే పెద్దగా వర్కవుట్ కాదు.