స్టీల్ సిటీలో సీన్ అదిరింది.....!

Update: 2018-09-10 03:30 GMT

విశాఖ గత ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చిన నగరం. అదే ప్రాంతంలో జనసునామి సృష్ట్టించారు వైఎస్ జగన్. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసిపి చీఫ్ సభకు జనం పోటెత్తారు. ఈ స్థాయిలో తమ సభ విజయవంతం కావడం పట్ల వైసిపి శ్రేణుల్లో ఆనందం తాండవిచ్చేస్తుంది. అర్బన్ ప్రాంతాల్లో వైసిపి బలహీనం అనే పలు రిపోర్ట్ లు ఆ పార్టీలో గత కొంత కాలంగా ఆందోళన కలిగించే అంశం కాగా స్టీల్ సిటీ ఆ అనుమానాలకు చెక్ పెట్టింది. పాదయాత్రలో సైతం అడుగడుగునా జనం వేలసంఖ్యలో తరలిరావడంతో వైసిపి శ్రేణులు సమరోత్సహంతో ఉరకలు వేస్తున్నాయి.

టిడిపి పై ఒక రేంజ్ లో ...

పెద్ద సంఖ్యలో వచ్చిన వారిని చూసి వైఎస్ జగన్ తన ప్రసంగంలో వాడి వేడి ని మరింత పెంచారు. భూకుంభకోణాలు, రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాలపై అధికారపార్టీపై విరుచుకుపడ్డారు. ప్రతి మాటలో ప్రశ్నలు వేస్తూ జనం నుంచే జవాబు చెప్పించే ప్రయత్నం చేశారు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కేంద్రానికి మించి విధిస్తున్న పన్నుల ఫలితంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ధరలు భగ్గుమంటున్నాయని వివరించారు.

వరాల జల్లు......

ఇలా వీటిపై పన్నులు పెంచి కాంగ్రెస్ పార్టీ తో జత కట్టి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టిడిపి ఉద్యమం చేయడాన్ని జగన్ తనదైన శైలిలో ఎద్దేవా చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇక వివిధ వర్గాలపై ముఖ్యంగా మహిళలు, యువతపై వరాల జల్లే కురిపించారు. విశాఖ డైయిరీ కుటుంబ డైయిరీ గా మార్చేశారని ఆరోపించారు. రైతుల నుంచి లీటర్ పాలు 20 రూపాయలకు కొని అరలీటరు 26 రూపాయలకు అమ్ముతూ దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తానికి విశాఖ జిల్లాలో జగన్ టూర్ సూపర్ సక్సెస్ గా నడవడం ఆ పార్టీ వర్గాల్లో కొత్త జోష్ తెచ్చిపెట్టింది.

Similar News