ఆ పార్టీని నమ్మొద్దని ఈ పార్టీ కాదు ఈ పార్టీని నమ్మకండి అని ఆ పార్టీ ప్రచారం సాగించడం పరిపాటే. ఎందుకు ఆ పార్టీని నమ్మొద్దో కూడా సహేతుక కారణాలను ప్రజలకు సరైన రీతిలో వివరించే వారినే చివరికి జనం నమ్మేది. ఇప్పుడు ఏపీలో మూడు ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేన లు తమ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తనపై కుట్ర అంటూ ధర్మ పోరాటం సాగిస్తూ ప్రజలను ఆకట్టుకునే తిప్పలు పడుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని కనుక దానికి బాధ్యులైన టిడిపి, జనసేన, బిజెపి లకు బుద్ధి చెప్పాలనే స్లోగన్ అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున జనంలోకి తెస్తున్నారు జగన్. చంద్రబాబు, జగన్ లకు ఓటు వేస్తే దోచేస్తారనే ప్రచారం సాగిస్తున్నారు జనసేన అధినేత. దాంతో అంతా అయోమయం రాజకీయాలే సాగుతున్నాయి.
పాలకొండలో పంచ్ డైలాగ్స్ ...
దీంతో ప్రజలకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేస్తున్నారు వైసిపి అధినేత తన కొత్త నినాదంతో జగన్ పాలకొండలో పంచ్ డైలాగ్స్ తో జనంలోకి దూసుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఆట ఒకటే అని వైసిపిని అధికారంలోకి రాకుండా ఉండేందుకే వారిద్దరూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని జగన్ అంటున్నారు. తాను ఒంటరిని చేసి అందరూ ఒక్కటయి ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఓట్లు చీలితే లాభమని.....
టిడిపి కి గత ఎన్నికల్లో ఓట్లు చీలితే నష్టమని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే లాభమని కనుక చంద్రబాబు, పవన్ ఆడుతున్న రాజకీయ డ్రామాకు మద్దత్తు ఇవ్వొద్దని విస్పష్టంగా చెప్పారు జగన్. 25 ఎంపి సీట్లు వైసిపి గెలుచుకుంటే ప్రత్యేక హోదా రాసి ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వచ్చని తెలిపారు. ఎపి రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలను తన పాదయాత్రలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు వైసిపి అధినేత. మరోసారి మోసం చేయడానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే తమ పార్టీకే అండగా వుండాలని పిలుపునిచ్చారు జగన్.