అనకాపల్లి అంచనా కరెక్టేనా?

Update: 2018-08-30 03:30 GMT

అనకాలపల్లి నియోజకవర్గం అంటే దాడి వీరభద్రరావు, కొణతాల కుటుంబాలకు మంచిపట్టున్న నియోజకవర్గం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సయితం ఇక్కడి నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ బోణీ కొట్టలేదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ప్రజారాజ్యం కూడా ఇక్కడ కాలు మోపగలిగింది. అటువంటి అనకాపల్లి నియోజకవర్గంలోకి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించింది.

దాడి కుటుంబానికి.....

అనకాపల్లి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దాడి కుటుంబం. 1985లో దాడి వీరభద్రరావు ఇక్కడి నుంచి పోటీ చేసి తొలిసారి పసుపు జెండాను ఎగురవేశారు. ఆతర్వాత వెనక్కు తిరగి చూసుకోలేదు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుస విజయాలను దాడి వీరభద్రరావును వరించాయి. అయితే 2004లో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దాడి వీరభద్రరావు వరుస విజయాలకు చెక్ పెట్టగలిగారు. 2009లో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ను ఓడించారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొణతాల రఘునాథ్ పై తెలుగుదేశం అభ్యర్థి పీలా గోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధించి మరోసారి పసుపు జెండాను రెపరెపలాడించగలిగారు.

జగన్ యాత్రతో......

ఇప్పుడు అనకాపల్లిలో వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పై భూ కబ్జా ఆరోపణలు పెల్లుబుకాయి. విశాఖ భూకుంభకోణంలో పీలా పాత్ర ఉందని విమర్శలు విన్పిస్తున్నా ఇప్పటి వరకూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తన నివేదికను బయట పెట్టకపోవడాన్ని జగన్ తప్పు పడుతున్నారు. అనకాపల్లిలో జరిగిన జగన్ బహిరంగ సభకు భారీ స్పందన కన్పించింది. అనకాపల్లి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బెల్లం పరిశ్రమ. బెల్లం పరిశ్రమకు చేయూత నివ్వాలంటూ పాదయాత్ర చేస్తున్న జగన్ కు లెక్కకు మిక్కిలిగా వినతి పత్రాలు అందాయి. బెల్లం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో వచ్చిన జనస్పందన చూసి వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాను స్థానిక వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News