వైసీపీ అధినేత జగన్ వద్దకు వెళ్లాలంటే ఇక కష్టమే. జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం, అది రాజకీయంగా సంచలనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించనున్నారు. ఆయన పాదయాత్ర చేసే సమయంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీ నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
మూడు అంచెల్లో.....
వైఎస్ జగన్ పై దాడి ఘటన నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జగన్ ను కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ, శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ బాలరాజు తెలిపారు. జగన్ చుట్టూ పోలీసు వలయం ఉంటుంది. అందరినీ పరిశీలించాకే జగన్ వద్దకు పంపిస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు జగన్ తో మాట్లాడాలనుకున్నా ముందుగా అనుమతి తీసుకోవాలని, సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మాత్రమే ఇక పోలీసులు జగన్ ను కలిసేందుకు అనుమతించనున్నారు.