వైసిపి చీఫ్ వైఎస్ జగన్ భార్య భారతి పేరును ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వ్యవహారం తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది ఫ్యాన్ పార్టీ. ఇదంతా టిడిపి కుట్ర అంటూ మొదట దాడి మొదలు పెట్టిన వైసిపి ఇప్పుడు దీన్ని మరో అస్త్రంగా మలిచింది. బిజెపి వైసిపి ఒకటే అని తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ కేసును ఉదాహరిస్తుంది ఆ పార్టీ. బిజెపి తో లోపాయికారి ఒప్పందం ఉంటే ఇలాంటి వేధింపులు తమకెందుకు ఉంటాయనే వాదాన్ని తెరపైకి తెస్తున్నారు వైసిపి నేతలు. బిజెపి టిడిపి కుమ్మక్కు అయ్యే వైఎసార్సీపి పై వేధింపులకు దిగుతున్నాయని జనంలోకి తెచ్చే ప్రయత్నం మొదలెట్టేశారు. ప్రతికూల అంశాలను అనుకూలంగా మలుచుకోవడంలో వైసిపి వ్యూహకర్తలు ఇటీవల ముందంజలో వుంటున్నారు.
టిడిపి దగ్గర జవాబు ఏది ...?
వైసిపి తాజాగా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించినా దీనికి సరైన జవాబు ఇవ్వడం లేదు టిడిపి. జగన్ పై కేసుల పాపం వెంటాడుతోందని ఈ వ్యవహారం నడుస్తుంది తప్ప తమ ప్రమేయం లేదని చెప్పుకొస్తున్నారు పసుపు పార్టీ నాయకులు. బిజెపి తో మీరు లోపాయికారి ఒప్పందం వుంది అంటే కాదు మీకే వుంది వారితో సంబంధం అనే వ్యాఖ్యలు రోజూ చేస్తూ అయోమయం రాజకీయాలను నడిపిస్తున్నాయి రెండు ప్రధాన పార్టీలు. వైఎస్ భారతిపై కేసు అంశంలో వైసిపికి ప్రజల్లో సానుభూతి లభిస్తుందన్న అంచనాకు టిడిపి వచ్చే తీవ్ర స్థాయిలో దాడి మొదలు పెట్టేసింది. ఏడేళ్ళ తరువాత ఎన్నికల ముందు ఈడీ ఇలా వ్యవహరించడం ప్రజలు రాజకీయ కోణంలోనే చూస్తారన్న ఫీడ్ బ్యాక్ తో టిడిపి అప్రమత్తమైంది.