ఉత్తరాంధ్ర లో దుమ్మురేపుతున్న విపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రిపై మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. ఐటి దాడులకు టిడిపి భయపడుతున్నందునే తన మీడియా తో నానా హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఓదార్పు యాత్ర కు మాట ఇచ్చి బయలుదేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయం గా అణగదొక్కేందుకు కుట్ర చేసి సిబిఐ కేసులు పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఎదురుదాడి చేశారు జగన్. ప్రత్యేక హోదా కోసం తాండ్రపాపారాయుడు తరహాలో ఢిల్లీ వెళ్ళినట్లు తన ఎల్లో మీడియా లో చిత్రీకరించుకుని చీకట్లో అగ్రీ గోల్డ్ ఆస్తులు చిల్లరకు బఠాణి, బిస్కట్లకు అమ్మేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.
బాబుపై ఎన్ని విమర్శలు చేసినా ...
చంద్రబాబు పై ఎన్ని విమర్శలు చేసినా దున్నపోతు పై వర్షం కురిసినట్లేనన్నారు వైఎస్ జగన్. అగ్రి గోల్డ్ బాధితులను ఆరునెలల్లో ఆదుకుంటానని జగన్ అనే నేను చెబుతున్నా అంటూ క్యాడర్ లో జోష్ పెంచే పంచ్ లు విసిరారు వైసిపి చీఫ్. తోటపల్లి ప్రాజెక్ట్ తానే కట్టినట్లు బాబు బిల్డ్ అప్ ఇస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో విద్యా వ్యాప్తికి, అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. స్థానిక డైట్ కళాశాలలో టెక్స్ట్ పుస్తకాలు లేవని ఒకే ఒక ఫ్యాకల్టీ ఉందని అంటే ఎంత దయనీయమని ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు విపక్ష నేత. చీపురుపల్లి ప్రాంతంలో నాలుగు అంబులెన్స్ లు నాలుగు వుండాలిసింది రెండే ఉంటే అవి కూడా పని చేయడం లేదని అదే వైఎస్ హయాంలో ఎలా పని చేసేవో తేడా వివరించారు జగన్.
బాబు పై జగన్ డైరెక్ట్ ఎటాక్......
పాదయాత్ర బహిరంగ సభల్లో స్టైల్ మారుస్తున్నారు జగన్. బాబు పాలనలో 108, 104 ల పనితీరును ప్రజల చేతే సభికులకు చెప్పే ప్రయత్నానికి మంచి స్పందనే లభించింది. గరివిడి మండలం కోడూరుకు చెందిన భవాని అనే విద్యార్థిని తనకు 972 మార్క్ లు ఇంటర్ లో వచ్చినా బిసి స్కాలర్ షిప్ రాలేదని పేర్కొంది. ఇటీవల తన పక్కింటి ఆవిడకు పురిటి నెప్పులు వస్తే 108 కి ఫోన్ చేస్తే టైర్ పంచర్ రాలేమని చెప్పారని , అతికష్టం మీద షేర్ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే బిడ్డను ప్రసవించిందని కొద్దిసేపు ఆలస్యం అయినా ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని భవాని చెప్పిన ఉదాహరణలు కు జనం నుంచి గట్టి రెస్పాన్స్ వచ్చింది.
రాష్ట్రంలో గ్లోబెల్ ప్రచారం ...
హిట్లర్ కి ఒకే ఒక్క గ్లోబెల్ అనే వ్యక్తి పదేపదే తప్పుడు ప్రచారాలు చేసేవారని జగన్ టిడిపి మీడియా కు డైరెక్ట్ ఎటాక్ ఇచ్చారు. నారా వారి పరిపాలనలో పదిమంది వరకు గ్లోబల్ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వీరిపట్ల అప్రమత్తం కావాలని జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఎల్లో మీడియా హోదా వద్దంటే ఆహా ఓహో అంటుందని, కావాలి అంటే మళ్ళీ ఇదే కూత కూస్తుందని, ప్రత్యేక హోదా సంజీవని కాదని అంటే అవునని, సంజీవని అన్నప్పుడు అవును అంటూ బాకాలు ఊదేస్తుందంటూ ఉతికేశారు జగన్. మూడు సార్లు హోదా పై ప్లేట్ మార్చినా ఎల్లో మీడియా ప్రశ్నించదని , బాబు నందిని పంది అన్నా పందిని నందిని అన్నా అదే కరెక్ట్ అంటుందని, విచ్చల విడి అవినీతి టీవీల్లో కనపడనీయదని బాబు కోసం ఏమి చేయడానికైనా వెనుకాడదన్నారు. బాబు బిజెపి కి జై అంటే జై , కాంగ్రెస్ కి జై అంటే దానికి జై అంటారని బాబు చేసే దోపిడీని డెవలప్మెంట్ అంటుందని ధ్వజమెత్తారు. ఇలా వరుసగా చంద్రబాబు ను ఆయనకు మద్దత్తుగా నిలుస్తున్న మీడియా పై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్.
ఈనాడు ను ఉదాహరణగా చూపిన జగన్ ...
ఈనాడు ను నేరుగా ఎటాక్ చేశారు వైఎస్ జగన్. ఇటీవల సి ఓటర్ సర్వేలో రాష్ట్రంలో 25 ఎంపి స్థానాలకు 21 స్థానాలు వస్తాయని రిపోర్ట్ చేస్తే నాలుగు టిడిపికి దక్కుతాయని స్పష్టంగా పేర్కొంటే ఈనాడు లో వచ్చిన వార్త ఎలా ఉందో చూడండి అన్నారు జగన్. అందులో వచ్చిన వార్తను చదివి వినిపించారు. మోడీకి స్వల్పంగా తగ్గిన ఆదరణ 272 స్థానాలు ఎన్డీయే కాంగ్రెస్ కి పెరిగిన సీట్లు అంటూ ఇచ్చిందని చూపారు వైసిపి చీఫ్. అంటే చంద్రబాబు కు వ్యతిరేకంగా వచ్చే ఏ వార్త ప్రజలకు చేరవేయడానికి మీడియా సిద్ధంగా లేదన్నారు జగన్. ఎల్లో మీడియా పూర్తిగా అమ్ముడు పోయిందని నిప్పుల వర్షం కురిపించారు. ఇదీ మీడియా పరిస్థితి అని వారిని నమ్మొద్దని అన్నారు జగన్. ఇలా ఆయన ప్రసంగం అంతా రొటీన్ కి భిన్నంగా సాగి ఉత్తరాంధ్రులను ఆకట్టుకుంది. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల లో జరిగిన సభలో అధికార పక్షాన్ని విమర్శలు ఆరోపణలతో ఊడ్చేశారు జగన్.