పూసగుచ్చినట్లు వివరించిన జగన్....!!

Update: 2018-11-14 03:58 GMT

తనపై హత్యాయత్నం చేసిన సంఘటనను వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఏపీ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన జగన్ మరోసారి తనపై దాడి సంఘటనను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ ద్వారా తెలిపారు. తనపై దాడి సంఘటనలో తక్షణం దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మొత్తం ఆరు పేజీల లేఖలో జగన్ తనపై జరిగిన దాడి, ఆ తర్వాత జరిగిన విషయాలన్నింటినీ లేఖలో పూసగుచ్చినట్లు వివరించారు. దర్యాప్తులో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుడటంతో కేసు పక్కదారి పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను హైదరాబాద్ కు ఎందుకు వెళ్లానంటే.....

దాడి తర్వాత వరుసగా జరిగిన పరిణామాలను తన లేఖలో వివరించారు. తనపై దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీజీపీ ఠాకూర్ లు స్పందించిన తీరును కూడా తెలిపారు. నిందితుడి నుంచి లభించిన లేఖ కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. తనపై దాడి జరిగిందని తెలిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతకు దారితీస్తుందని తెలిసే తాను ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ బయలుదేరానని చెప్పారు. తన భుజానికి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమవ్వడంతో హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నానని లేఖలో వివరించారు.

లోకేష్ తో సంబంధాలు.....

తనపై హత్యాయత్నం వెనుక కొందరు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తనపై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ నేత హర్షవర్థన్ ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన టీడీపీ టిక్కెట్ ఆశించారని, అతనికి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ కు సంబంధాలున్నాయని లేఖలో వివరించారు. నిందితుడికి నేర చరిత్ర ఉండటం కూడా సందేహాలకు అవకాశమిస్తుందని చెప్పారు. టీడీపీ నేతల సహకారం లేకుండా తనపై హత్యాయత్నం జరిగే అవకాశం లేదని జగన్ తన లేఖలో వివరించారు. ఆపరేషన్ గరుడ అంటూ సినీ నటుడు శివాజీ చేత అధికార పార్టీ ముందుగానే స్కెచ్ వేయించిందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుండా స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని జగన్ తన లేఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు.

Similar News