మాడగుల అంటేనే హల్వాకు ఫేమస్. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన వాళ్లెవ్వరూ మాడగుల హల్వాను రుచిచూడకుండా రాలేరు. అలాంటి మాడగుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వె.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. మాడగుల నియోజకవర్గంలో ప్రజలు జగన్ రాకకోసం వీధుల వెంట ఎదురుచూస్తుండటం కన్పిస్తోంది. మిద్దెలు, మేడలు ఎక్కి మరీ జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. మాడగుల నియోజకవర్గంలో కె.కోటపాడులో జరిగిన జగన్ బహిరంగ సభకు ఇసుకవేస్తే రాలినంత మంది జనం రావడం పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే.
గత ఎన్నికల్లో.....
మాడగుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీయే గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి బుడి ముత్యాలనాయుడు తన సమీప టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడిపై దాదాపు ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి తొలినుంచి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కలసి ప్రచారంచేసినా విజయం సాధించలేకపోయాయి. జనరల్ నియోజకవర్గం కావడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ నిన్న మొన్నటి వరకూ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది.
టీడీపీకి పట్టున్న.....
1958లో మాడగుల నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన 13 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవాలో ఈ నియోజకవర్గం నుంచి కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా రెడ్డి సత్యనారాయణ నాలుగుసార్లు వరుస విజయాలు సాధించి రికార్డులకు ఎక్కారు. 2009 లో మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
పెద్దయెత్తున స్వాగతం......
విశాఖపట్నానికి చేరువలో ఉండే ఈ నియోజకవర్గంలో మరోసారి జెండా ఎగురవేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. మాడుగుల నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించగానే పెద్దయెత్తున స్వాగతం లభించింది. కొత్తపెంట, ఎ.భీమవరం, పడుగుపాలెం, ఎ.కొండూరు. కె.కోటపాడు ప్రాంతాల్లో పెద్దయెత్తున జనం జగన్ ను చూసేందుకు తరలి రావడంతో ఈసారి కూడా మాడగుల నియోజకవర్గం తమదేనన్న ధీమాలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్యాలనాయుడికి కూడా మంచిపట్టుంది. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాన్ గిరగిరా తిరుగుతుందన్న ఆత్మవిశ్వాసంలో వైసీపీ నేతలు ఉన్నారు.