బాబు నాలుగున్నరేళ్ల పాలనలో విశాఖ రివర్స్ లోకి వెళ్లిందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఐటీ సిగ్నేచర్ టవర్స్ ఎక్కడైనా కన్పిస్తున్నాయా? అని ప్రశ్నించారు. విశాఖలోని కంచరపాలెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నిలబెట్టారన్నారు. వైఎస్ హయాంలో విశాఖ అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. పేదల కోసం వైఎస్ లక్షల ఇళ్లు కట్టించారన్నారు.
హామీలకు దిక్కేది....?
చంద్రబాబు హామీలకు దిక్కులేకుండా పోయిందన్నారు. విశాఖ భూములన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారన్నారు. అతి విలువైన భూములన్నింటినీ తన అనుచరులకు కట్టబెట్టారన్నారు. గీతం మూర్తికి వందల ఎకరాలు ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. లూలూ గ్రూపుకు వందల కోట్లు విలువ చేసే భూములను చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనక్కాయలు, బిస్కెట్లకు భూములను చంద్రబాబు పంచిపెట్టారన్నారు.
గంటా బొక్కేశారు.....
విశాఖలో టీడీపీ నేతలు భూరికార్డులను మార్చివేస్తారన్నారు. తమది కాని ప్రభుత్వ భూములను తమ పేరిటే పత్రాలు సృష్టించి, ఏకంగా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటారన్నారు. విశాఖలో మంత్రి గంటా వేలాది ఎకరాలను ఆక్రమించుకున్నా పట్టించుకోలేదన్నారు. గంటా ఈ స్థాయిలో విశాఖపట్నంలో దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదని మంత్రి గంటాపై విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం పేదల భూములను బలవంతంగా తీసుకుంటారని, మంత్రి అయ్యన్నభూములను మాత్రం ముట్టుకోరన్నారు.
కంప్యూటర్లకు కూడా అబద్ధాలు.....
విశాఖలో భాగస్వామ్య సదస్సుల పేరిట మీటింగ్ లు పెట్టి రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెబుతారని, మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈనాలుగైదేళ్లలో ఐదు వేల కోట్లు కూడా రాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. చంద్రబాబుకు పత్ర్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గుర్తుకు రావడం లేదన్నారు. కంప్యూటర్లకు కూడా చంద్రబాబు అబద్ధాలు నేర్పగలుగుతారన్నారు. కంచరపాలెం సభకు పెద్దయెత్తున జనం రావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగాయి.