ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, మరోవైపు సర్వేల ఫలితాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. జగన్ పాదయాత్రతో ఇప్పటికే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు కొంత ఊపు వచ్చింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో విజయనగరం జిల్లాకు జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా, విశాఖ పట్టణంలో విపరీతంగా స్పందన రావడంతో ఆ పార్టీ నేతలు కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు.
సర్వేలు కూడా......
పాదయాత్ర ఇలా సాగుతుండగా సర్వేలు కూడా తమ అధినేతకు అనుకూలంగా వస్తుండటం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఇప్పటి వరకూ జనసేన పార్టీ పవన్ కల్యాణ్ పార్టీతో వైసీపీకి ఇబ్బందులు తప్పువని కొంత ఆందోళన ఆ పార్టీనేతల్లో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిస్తే అది చంద్రబాబుకు లబ్ది చేకూరుతుందన్న విశ్లేషణలూ వినిపించాయి. దీంతో వైసీపీ నేతల్లో ఎక్కడో ఒక మూల అనుమానం మాత్రం లేకపోలేదు. అయితే జగన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర చేస్తూ వెళుతున్నారు.
ఎక్కువమంది జగన్ వైపే.....
తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ఎక్కువమంది ప్రజలు మొగ్గుచూపించడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ సర్వేలో వెల్లడడయింది. జగన్ కు 43 శాతం మంది ప్రజలు మద్దతుగా నిలవగా, చంద్రబాబును 38 శాతం మంది సమర్థించారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ‌్ ను కేవలం ఐదు శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రిగా అంగీకరించారు.
నో జనసేనాని, కాంగ్రెస్.......
జనసేనాని పవన్ కల్యాణ‌్ ప్రజల్లో విస్తృతంగా పర్యటించిన తర్వాతే ఈ సర్వే జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి చంద్రబాబు, లోకేశ్ లపై పవన్ విమర్శలు చేసిన తర్వాతనే ఈ సర్వే జరిగింది. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకూ 10,650 మందిని ఈ సర్వే ద్వారా ప్రశ్నించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక కాంగ్రెస్, టీడీపీ ఏపీలో జత కట్టినా పెద్దగా వైసీపీకి నష్టముండదని సర్వేలో తేల్చింది. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమేనని సర్వే తేల్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఈ సర్వేలో వెల్లడయింది. దీంతో జనసేన, కాంగ్రెస్ లతో తమకు పెద్దగా నష్టముండదని, ప్రజలు ఇప్పటికే డిసైడ్ పోయారన్న టాక్ వైసీపీలో బలంగా విన్పిస్తోంది.