ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలీలోకి వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించనుంది. భీమిలి నియోజకవర్గమంటే ముందుగా గుర్తుకొచ్చేది భూకుంభకోణాలు. ఇక్కడ అతి విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలే దగ్గరుండి భీమిలీ భూములను నొక్కేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సిట్ దర్యాప్తు చేసినా ఇంకా నివేదిక వెల్లడించకపోవడం విశేషం. ప్రస్తుతం ప్రజా సంకల్ప పాదయాత్ర భీమిలీ నియోజకవర్గంలో జరుగుతుండటంతో మంత్రి గంటా శ్రీనివాసరావుపై జగన్ విరుచుకుపడే అవకాశముంది.
విభిన్న తీర్పులతో......
భీమిలీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జరిగిన రెండు ఎన్నికల్లోనూ విభిన్నమైన తీర్పు ఇచ్చారు భీమిలీ వాసులు. 2009 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆంజనేయరాజుపై అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ దాదాపు ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక గత ఎన్నికలను ఒకసారి చూస్తే.... వైసీపీ అభ్యర్థి కర్రి సీతారామ్ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుపై దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైసీపీకి కొంత బలమున్నా, ఈసారి జనసేన ఎంట్రీ ఇవ్వనుండటంతో ఎవరిది ఈసారి విజయమన్నది తేల్చలేని పరిస్థితి.
గంటా పై వ్యతిరేకత ఉందని......
త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు ఇక్కడి నుంచి గెలవడం కొంత కష్టమే. అయితే తాను భీమిలీ నుంచే పోటీ చేస్తానని గంటా ఇప్పటికే ప్రకటించారు. భీమిలీ టిక్కెట్ విషయంలోనూ, భీమిలీలో గంటాకు వ్యతిరేకత పెరుగుతుందన్న సర్వే రిపోర్ట్ లతో ఆయన కొన్ని రోజుల క్రితం అలకబూనిన సంగతి తెలిసిందే. చివరకు హోంమంత్రి చినరాజప్ప జోక్యంతో ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
జగన్ ఫైర్ అవుతారా?
ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర భీమిలి నియోజకవర్గంలో ప్రారంభమైంది. జగన్ పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశారు. భీమిలీ నియోజకవర్గంలో దాదాపు పదివేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది. భూ కుంభకోణాలను నిరసిస్తూ గతంలో వైసీపీ విశాఖలో మహా ధర్నాను కూడా చేపట్టింది. భీమిలీ నియోజకవర్గంలో వందలాది ఎకరాలను గంటా శ్రీనివాసరావు తన బంధువుకు చెందిన కంపెనీ అయిన ప్రత్యూషకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. అలాగే మరో టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవిందుపైనా ఇదే రకమైన విమర్శలున్నాయి.వీటన్నింటిపైనా జగన్ స్పందించే అవకాశముంది.