వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో బెజవాడ నుంచే ఇక పాలిటిక్స్ నడిపించనున్నారు. విజయవాడలో ప్రస్తుతం తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం మాత్రం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉంది. దీనిపై గత కొద్దిరోజులుగా విమర్శలు విన్పిస్తుండటంతో ఆయన తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని బందరు రోడ్డులో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారధికి చెందిన స్థలంలో ఈ తాత్కాలిక కార్యక్రమం కొన్ని నెలలుగా పనిచేస్తుంది. కాని కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి మార్చాలన్న ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.
పార్టీ కార్యాలయ నిర్మాణం......
అమరావతిలో పార్టీ కార్యాలయ నిర్మాణపు పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ముగించేలోపు పార్టీ కార్యాలయం నిర్మాణంతో పాటు జగన్ ఇంటి నిర్మాణపు పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జగన్ ఇంటి నిర్మాణపు పనులను సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు జనవరిలో జరుగుతాయని అంచనా ఉంది. అలా కాకుండా షెడ్యూల్ ప్రకారమే జరిగినా వచ్చే ఏడాది మార్చికి ఎన్నికలు జరుగుతాయి. ఈలోపే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, మకాంను విజయవాడకు మార్చాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు.
విమర్శలను తిప్పికొట్టేందుకు....
జగన్ హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో కొంతకాలంగా విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ పొరుగు రాష్ట్ర వాసిగా పేర్కొంటూ వస్తున్నారు. అయితే పదేళ్లపాటు హైదరాబాద్ లో ఉండే అవకాశమున్నప్పటికీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత వేగంగా పాలనను అమరావతికి చంద్రబాబు తరలించారని వైసీపీ నేతలూ విమర్శించారు.తెలుగుదేశం పార్టీ కూడా తన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించింది. పూర్తి హైటెక్ హంగులతో తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయ నిర్మాణపనులను ప్రారంభించింది.
డిసెంబరు నెల నుంచే.....
వైసీపీ కూడా ఈ ఏడాది డిసెంబరు నాటికి పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పాదయాత్రలోఉన్న జగన్ నవబంరు నెలలో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. పాదయాత్ర పూర్తయిన వెంటనే వారం రోజుల పాటు జగన్ పూర్తి విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి కేంద్రంగానే శాశ్వతంగా నిర్మించిన పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీనియర్ నేత ఒకరు చెప్పారు. జగన్ ఇకపై బెజవాడలోనే అందుబాటులో ఉండేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం మీద బెజవాడ కేంద్రంగా పూర్తిస్థాయి కార్యకలాపాలను నిర్వహించేందుకు జగన్ సిద్ధమయ్యారన్న మాట.