జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో పాల్గొన్న తొమ్మిది మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో తొమ్మిది మంది ఉపాధ్యాయులు జగన్ ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తాను అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పడంతో వారు ఆయనను కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే వీరు జగన్ ను కలిసినప్పుడు ఆయనకు అనుకూలంగా పెద్దయెత్తున నినాదాలు చేశారన్న వార్తాకథనాలకు సుమోటోగా స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వీరు ప్రవర్తించారని సస్పెండ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా విశాఖ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు.