శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలుస్తారని ఆపార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. తిత్లీ తుపానుకు సిక్కోలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివేదికలను రూపొందించి తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు సమర్పించింది. పదిహేను రోజుల్లో జగన్ తుపాను బాధితలను కలవనున్నారు. తిత్లీ తుపాను కు సిక్కోలు జిల్లాలో దాదాపు 3,464 కోట్లు నష్టం వాటిల్లినట్లు వైసీపీ అంచనా వేసింది. తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుంటే తాము ఆరునెలల్లో అధికారంలోకి రాగానే మొత్తం నష్టాన్ని బాధితులకు అందజేస్తామని వైసీపీ పేర్కొంది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ తుపాను బాధితులను పరామర్శించలేదని చంద్రబాబు చేస్తున్న విమర్శల నేపథ్యంలో వైసీపీ ఈ వివరణ ఇచ్చింది.