మారథాన్ పాదయాత్ర సాగిస్తున్న విపక్షనేత జగన్ మోహన్ రెడ్డి 300 ల రోజు పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. సుదీర్ఘ పాదయాత్ర సాగించి మరో అరుదైన రికార్డ్ నెలకొల్పారు జగన్. విజయనగరం జిల్లా పార్వతీపురం దాటి కురుపాం ప్రాంతాన్ని చేరుకున్నారు ఆయన. తోటపల్లి రిజర్వాయర్ మీదుగా సాగిన జగన్ పాదయాత్రకు బ్రహ్మరధం పట్టారు స్థానికులు. తన 300 ల రోజు 10.2 కిలోమీటర్లు నడిచారు జగన్. రికార్డ్ రోజుల యాత్రకు గుర్తుగా ఒక మొక్కను నాటారు విపక్ష నేత.
రెల్లి కులానికి కార్పొరేషన్ ప్రకటించి ...
రాష్ట్రంలో రెల్లి కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ కుల నేతలు జగన్ దృష్టికి తెచ్చారు. రెల్లి కార్పొరేషన్ ద్వారా అన్ని సమస్యలను వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చాకా పరిష్కరిస్తామని జగన్ వారికి హామీనిచ్చారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వర్గాలు, విధ్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు జగన్ కు వినతి పత్రాలు అందించారు. తోటపల్లి నిర్వాసితులు తమ సమస్యలు నివేదించుకున్నారు. తమకు సర్కార్ నుంచి పరిహారం అందలేదని వాపోయారు.
అందరితో మమేకమై.....
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని టిడిపి, కాంగ్రెస్ నేతలు రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు నేతృత్వంలో జగన్ సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. వారిని సాదరంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. పాదయాత్ర 300 వ రోజు చేరుకున్న సందర్భంగా జగన్ జనంతో హుషారుగా మమేకం అయ్యారు.