అక్కడ దుమ్మురేపుతున్న జగన్...!

Update: 2018-10-01 03:30 GMT

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఇలాకాలో వైసిపి అధినేత జగన్ దుమ్ము రేపుతున్నారు. జగన్ పాదయాత్ర గజపతినగరం పూర్తి అయ్యి విజయనగరం కి సోమవారం చేరుకుంటుంది. ఇప్పటివరకు వైసిపి చీఫ్ 3055.8 కిలోమీటర్ల దూరం ప్రజా సంకల్ప యాత్రలో సాగిపోయారు. టిడిపి కి కంచుకోట లాంటి ప్రాంతంలో వైసిపి అధినేత టూర్ హుషారుగా సాగుతూ ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆదివారం నాటికి జగన్ 294 వ రోజు పాదయాత్రను పూర్తి చేయడం విశేషం.

అదే జనం ... అదే జోరు ...

గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా తూర్పు గోదావరి లో జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అదే జోరు విశాఖలోనూ కొనసాగింది. ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో కూడా జగన పాదయాత్రకు వేలాదిగా జనం తరలిరావడం విశేషం. మాజీ మంత్రి వైసిపి లో కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రణాళిక బద్ధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ రూపొందించారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ యాత్ర సక్సెస్ కు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో తన పట్టును అధినేత ముందు చెప్పక చెప్పారు. జగన్ తో పాటు అడుగులు వేస్తూ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు బొత్స.

వినతుల వెల్లువ ...

జగన్ పాదయాత్రలో వినతులు వెల్లువలా వస్తూనే వున్నాయి. తమకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగులు అడుగడుగునా జగన్ కు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కొందరు తమకు పూర్తి అంగవైకల్యం వున్నా చంద్రన్న భీమా వర్తింప చేయడంలేదంటూ ప్రభుత్వ పనితీరుపై వైసిపి చీఫ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. విశ్వ బ్రాహ్మణులు తమకు వృత్తి భరోసా కోరారు. వారిపై జగన్ వరాలు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక కార్పొరేషన్ వారికి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అలాగే విశ్వ బ్రాహ్మణుల నుంచి ఒకరికి ఎమ్యెల్సీ గా అవకాశం కల్పిస్తామని తాళిబొట్టు తయారు చేసే హక్కు ను వారికి దక్కేలా కృషి చేస్తా అని హామీలు ఇచ్చారు. మొత్తానికి జగన్ టూర్ లక్ష్యానికి దగ్గరగా చేరువ అవుతూ ఉండటంతో పాదయాత్ర ను విజయవంతం చేసేందుకు వైసిపి శ్రేణులు మరింత ఉత్సహంగా పనిచేస్తున్నాయి.

Similar News