వేటు లేదు... చోటు దక్కడం ఖాయమట

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ కన్నా బీజేపీ వైపు ఉండటమే మేలన్నది ఆయన భావన.

Update: 2021-12-20 04:22 GMT

ఎన్నికలకు దగ్గర పడే కొద్దీ రాజకీయ నేతలు తమ దారి తాము చూసుకుంటారు. తాము ఉన్న పార్టీలో అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బంది పడటం, గెలిచే పార్టీవైపు వెళ్లడం మామూలే. ఎన్నికలకు ఏడాది ముందు జంప్ చేసినా తమ పదవులపై ఎటువంటి ఇబ్బందులు ఉండటం. అనర్హత వేటు వంటివి పడే అవకాశం లేదు. ఎందుకంటే దీనిపై విచారణ జరిగే లోపే పదవీకాలం పూర్తవుతుంది. అందుకే ఇప్పటి నుంచే రఘురామ కృష్ణరాజు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ కన్నా బీజేపీ వైపు ఉండటమే మేలన్నది రఘురామ కృష్ణరాజు భావన.

నరసాపురం నుంచే...
ఎందుకంటే తాను నరసాపురం పార్లమెంటుకు ప్రస్తుతం ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియులతో పాటు బీజేపీకి కూడా అవకాశముంది. నియోజకవర్గంలో ట్రాక్ రికార్డు అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందంటే మరోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. టీడీపీలో కన్నా బీజేపీలో చేరడటమే బెటర్ అని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. టీడీపీలో చేరితే ఈ టిక్కెట్ బీజేపీకి పొత్తులో భాగంగా దక్కితే తనకు రాజకీయంగా నష్టం. అందుకే బీజేపీ వైపు రఘురామ కృష్ణరాజు చూస్తున్నారు.
బీజేపీలో చేరితేనే....
ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా బీజేపీలో చేరడమే మంచిదని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే జగన్ పార్టీలో ఉండి విమర్శిస్తే బ్యాక్ సపోర్టు టీడీపీ ఉందని అనే కంటే బీజేపీ ఉందని ప్రచారం జరగడమే బాబుకు కావాలి. అప్పుడే జగన్ కు డ్యామేజీ జరుగుతుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి రైతు సభలోనూ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నా అది సన్నిహితం కోసమే. పార్టీలో చేరడానికి ఏమాత్రం కాదు.
త్వరలో నిర్ణయమట...
త్వరలోనే రఘురామ కృష్ణరాజు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తనకు రాష్ట్రంలో కూడా మంచి గ్రిప్ దొరుకుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే రాజుగారు బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన బలమైన హామీ మేరకే బహిరంగంగా వైసీపీని, జగన్ ను, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారన్నది వాస్తవం. అనర్హత వేటు రఘురామ కృష్ణరాజు పదవీ కాలం పూర్తయ్యేంతవరకూ ఆయన పై అనర్హత వేటు పడే అవకాశాలే లేవు.


Tags:    

Similar News