రాజీనామా వెనక అసలు కారణం ఇదేనా?
ఫిబ్రవరి ఐదు తర్వాత రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. ఆయనకు స్పష్టమైన సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే రాజీనామా యోచనకు దిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి ఐదు తర్వాత రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు పడుతుందని తెలియడంతోనే ఆయన ముందుగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు పెద్దల సూచనలు కూడా అందడంతో ఆయన రాజీనామా ఆలోచన చేశారంటున్నారు.
మొండోడుగానే...
నిజానికి రఘురామ కృష్ణరాజు జగన్ కంటే మొండోడు అన్న పేరుంది. ఆయన పార్టీలోనే ఉండి ఇబ్బంది పెట్టాలని భావించారు. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారితే సరిపోతుందనుకున్నారు. ఏ పార్టీలో చేరాలన్నది అప్పుడే నిర్ణయించుకోవచ్చని, అప్పటి వరకూ అన్ని పార్టీలతో సఖ్యత కొనసాగించాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఈ మేరకు బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లోకి వెళ్లారు. అందుకే పార్టీని థిక్కరించకుండా విమర్శలు చేస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
పార్టీలోనే ఉంటూ...
ఇదే పద్ధతిని 2024 ఎన్నికల వరకూ కంటిన్యూ చేయాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతల కూడా ఇదే రకమైన సలహా ఇవ్వడంతో రచ్చ బండ పేరుతో మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ఆయన వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం కదిలింది. రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ప్రాధమిక దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
అనర్హత వేటు పడుతుందని.....
రఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని కొందరు బీజేపీ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే ఆయనను గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారని, లేకుంటే అనర్హత వేటు పడుతుందని చెప్పడంతోనే ఆయన రాజీనామాకు సిద్దమయ్యారు. మరో వారం రోజుల్లో రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఆయన రాజీనామా వెనక ఇదే ప్రధాన కారణమన్న కామెంట్స్ ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అనర్హత వేటు తనపై పడేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఆయన చెబుతున్నా, కొందరి సూచనల మేరకే ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.