జగన్ సూపర్ సక్సెస్...ఆశలయితే పెంచారు

వైసీపీలో కొనసాగితే.. జగన్ దృష్టిలో పడితే ఎప్పటికైనా పదవులు వస్తాయన్న నమ్మకాన్ని నేతల్లో కలిగించడంలో జగన్ సక్సెస్అయ్యారు;

Update: 2023-02-22 06:51 GMT

వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎంతమంది కలసి వచ్చినా ఒంటరిగా పోట ీచేసి మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించాలన్న యత్నంలో ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రయత్నాలన్నీ ఉన్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో వైపు పదవుల పంపకాన్ని కూడా చేపట్టారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలకు వైసీీపీలో వచ్చిన పదవులు మరే ప్రభుత్వంలో రాలేదనే చెప్పాలి. అందుకే వైసీపీలో కొనసాగితే.. జగన్ దృష్టిలో పడితే ఎప్పటికైనా పదవులు వస్తాయన్న నమ్మకాన్ని నేతల్లో కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఎన్నడూ మండలి చూడని...
ఎన్నడూ చట్టసభల్లోకి అడుగుపెట్టని కులాల వారిని కూడా వెతికి మరీ జగన్ పదవులు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ నిర్ణయం కొందరికి ఇబ్బందిగా ఉండవచ్చు. తమకు పదవులు దక్కలేదని అనుకోవచ్చు. అలాగే విపక్షాలు కూడా పవర్ లేని పదవులు ఎందుకు అని విమర్శలు చేయవచ్చు. అలంకార ప్రాయంగానే ఓట్ల కోసం పదవులు ఇస్తున్నారని ప్రతిపక్షాలు సూటిపోటీ మాటలు అనొచ్చు. కానీ ఫైనల్ గా ఇప్పటి వరకూ వినని కులాల పేర్లు కూడా జగన్ బయటకు తీసుకు వచ్చారు. వారికి చట్ట సభల్లో స్థానం కల్పిస్తున్నారు. శాసనమండలిలో అడుగుపెట్టడం సామాన్య విషయమేమీ కాదు.
ఎమ్మెల్సీ కావాలంటే...?
ఒకప్పుడు ఎమ్మెల్సీ అవ్వాలంటే ఎన్నో అర్హతలుండేవి. కులాలతో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడి ఉంటేనే వారికి పెద్దల సభలో చోటు దక్కుతుంది. ఏ పార్టీలోనైనా ఇంతే. కానీ జగన్ వచ్చాక పూర్తిగా ఛేంజ్ చేశారనే చెప్పాలి. తాము జీవితంలో ఎమ్మెల్సీ అవుతామని ఊహకు కూడా నోచుకోని వారు పదవులు అందుకుంటున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే జగన్ ఎప్పటికైనా తమకు మంచి పదవులు ఇస్తారన్న నమ్మకం కార్యకర్తల్లో కలుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు.. వీళ్లుకాదు ఇప్పుడు శాసనమండలికి వస్తోంది. అంతా కొత్త వారే. రాజకీయంగా ఏమాత్రం పలుకుబడి లేని వాళ్లే. అలాంటి వారికి పదవులు సులువుగా జగన్ ఇచ్చారంటే తమకు ఎందుకు రావన్న ధీమా మిగిలిన నేతల్లో పెరిగే అవకాశముంది. గంపగుత్తగా వచ్చే ఎన్నికల్లో ఆ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి పడతాయో? లేదో? చెప్పలేం గాని సింహభాగం ఓటర్లను మాత్రం జగన్ ఆకట్టుకోగలిగారనడంలో ఎలాంటి సందేహం లేదు.
వచ్చే ఎన్నికల్లో...
ఈ ధీమాయే వచ్చే ఎన్నికల్లో వారిని పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు పని చేస్తుందని జగన్ వేసుకుంటున్న లెక్కలు వర్క్ అవుట్ అవుతాయనే అనుకుంటున్నారు.ఎన్నడూ ఎవరూ తమ సామాజికవర్గాన్ని ఇంతవరకూ గుర్తించలేదని, జగన్ మత్రమే తమను ఏరికోరి ఎంపిక చేయడం పట్ల ఆ సామాజికవర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సంతృప్తి చెందుతున్నాయి. ఒక వ్యక్తికి పదవి ఇచ్చినంత మాత్రాన సామాజికవర్గమంతా బాగుపడకపోయినా, ఆ కులం సమస్యలు పరిష్కారానికి సులువైన మార్గం ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దొరుకుతుందనడంలో అతిశయోక్తి లేదు. జగన్ కు మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలే అండగా ఉండేవి. ఇప్పుడు బీసీ వర్గాలు కూడా తోడయ్యాయని వైసీపీ నేతలు సంబరపడి పోతున్నారు. మరి చివరకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందే. ఆ మేరకు జగన్ బలహీనవర్గాలకు ఒక మంచి పని చేశారనే చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.


Tags:    

Similar News