తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. తనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం వల్లె హత్యాయత్నం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయంగా కేసు ధర్యాప్తు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హత్యాయత్నం ఘటనపై కేంద్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ పిటీషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ డీజీపీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.
రేపు విచారణకు .....?
ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు, డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారని, అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కూడా జగన్ పిటీషన్ లో జతచేశారు. మొత్తం 11 పేజీల కాపీని కోర్టుకు అందజేశారు. ఆపరేషన్ గరుడ పేరుతో తనపై కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. సినీ నటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని, తనపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పారని, తనను హత్య చేసి ఆపరేషన్ గరుడలో భాగమంటూ చిత్రీకరించాలని చూస్తున్నారని పిటీషన్ లో జగన్ పేర్కొన్నారు.