జగన్ విశాఖ పర్యటన అడుగడుగునా వైసిపిలో జోష్ నింపుతుంది. వర్షాలను సైతం లెక్కచేయకుండా ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజాసంకల్ప యాత్ర పై విశాఖ వైసిపి వర్గాలు ఆందోళన చెందాయి. కానీ తూర్పు గోదావరి పర్యటనలో వచ్చిన స్పందనే విశాఖ జిల్లాలో రెట్టింపు స్థాయిలో రావడంతో వైసిపి క్యాడర్ ఉబ్బి తబ్బిబు అయిపోతుంది. టిడిపి సర్కార్ పై ప్రజల్లో నమ్మకం సడలడం వల్లే తమ నేత పర్యటనలు సూపర్ సక్సెస్ అవుతున్నాయని నర్సీపట్నం సభ తరువాత పలువురు వైసిపి నేతలు ఆనందంగా చేసిన వ్యాఖ్యలు వారి జోష్ కి అద్దం పడుతున్నాయి.
అదిరింది నర్సీపట్నం ...
పోగొట్టుకున్న చోటే వెతుకుతున్నారు వైసిపి చీఫ్ జగన్. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండే విశాఖ జిల్లా నర్సీపట్నం రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. ఆయన అడ్డాలో వైసిపి చీఫ్ కి అనూహ్య రీతిలో అపూర్వ ఆదరణ చూపించారు అక్కడివారు. ఆ నియోజకవర్గంలో యాత్ర సక్సెస్ పై క్యాడర్ కొందరు వ్యక్తం చేసిన అనుమానాలు జగన్ సభతో పటాపంచలు అయిపోయాయి. ఒక పక్క వర్షం కురుస్తున్నా ఇసుకవేస్తే రాలనంతగా జనం జై జగన్ అనడంతో వైసిపి శ్రేణులతో పాటు ప్రత్యర్థి పార్టీలు ఆమ్మో ఏంటి ఈ ప్రభంజనం అనే చర్చ మొదలైంది. విశాఖ జిల్లా టూర్ ఇక ఇలాగే సాగుతుందన్న ధీమా వైసిపి శ్రేణుల్లో వ్యక్తం కావడం గమనార్హం.