అదే జరిగితే... జగన్ కు నష్టమే
వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రిగా పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉంది. 2024లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి
వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రిగా పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉంది. 2024లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ కు రెండో ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనాతో సమయం సరిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలతో జగన్ కు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా వరదలు రావడం మొదలెట్టాయి. పంటలు పూర్తిగా నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతాంగానికి వరద నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమయిందన్న విమర్శలు జగన్ ఎదుర్కొన్నారు. విద్య, వైద్యం పైనే ఈ మూడేళ్లు జగన్ ఎక్కువ దృష్టి పెట్టారు. మిగిలిన శాఖలను విస్మరించారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే కరోనా సమయంలోనూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను నిలుపుదల చేయకుండా అందరికీ అందజేయడం కొంత అనుకూలంగానే కనిపిస్తున్నా మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో మాత్రం వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయం నెలకొంది.
ఎక్కువ పోలింగ్ జరిగితే...
ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే జగన్ నష్టపోతారన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. పోలింగ్ లో ఉన్నత స్థాయి వర్గాలు, మధ్య తరగతి ప్రజలు దూరంగా ఉంటారన్నది ఎంతకాలం నుంచో చూస్తున్నాం. కేవలం పేద వర్గాలే పోలింగ్ లో విరివిగా పాల్గొంటాయి. ఆ రెండు వర్గాలు పోలింగ్ కు దూరమయితే అది జగన్ కు లాభమవుతుంది. వారు ఎక్కువగా పోలింగ్ లో పాల్గొంటే జగన్ కు నష్టం జరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. జగన్ అభివృద్ధిని పక్కన పెట్టి పేదలకు నిధులను పంచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ రెండు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
న్యూట్రల్ ఓటర్లు....
ఇటీవల రెండు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేలోనూ జగన్ పార్టీకే ఎక్కువ పార్లమెంటు స్థానాలు వస్తాయని తేలింది. అయితే సర్వేలో కూడా ఎక్కువ మంది పేద ప్రజలే పాల్గొన్నారన్నది విపక్ష నేతల మాట. మధ్య, ఉన్నత వర్గాలే కాకుండా జగన్ ప్రభుత్వం పట్ల న్యూట్రల్ ఓట్లు వ్యతిరేకంగా ఉన్నారని, న్యూట్రల్ ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారిదే అధికారమని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భావిస్తుంది. అందుకే టీడీపీ ఆ మూడు వర్గాలపై కన్నేసింది. జగన్ మాత్రం మరో రెండేళ్లు కూడా కేవలం తాను అనుకున్న ప్రకారమే ముందుకు వెళితే రాజకీయంగా కొంత ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పోలింగ్ శాతాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం.