సీఎం చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రంపై తీవ్ర పోరుకు సన్నద్ధమైన చంద్రబాబు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. విషయంలోకి వెళ్తే.. కేంద్రంపై యుద్ధానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఫలాలు సాధించేం దుకు బాబు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీతో టీడీపీ బంధాన్ని తెంచుకుంది.
అఖిలపక్షంతో సమావేశం.....
నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసిన పార్టీ ఒక్కసారిగా బంధాన్ని బద్దలు చేసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి కూడా బయట పడింది. అనంతరం కేంద్రంపై మరింత పోరు పెంచింది. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఇద్దరు టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయించారు చంద్రబాబు. అనంతరం, రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో ఆయన కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించారు. గడిచిన రెండు వారాలకు పైగాటీడీపీ ఎంపీలు కేంద్రంతో తలపడుతున్నారు. పార్లమెంటులో రగడ సృష్టిస్తున్నారు. ఏపీ సమస్యలపై చర్చకు పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఏం చేయా లో ఆలోచించిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచే నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలను, అన్ని సంఘాలను కలు పుకొని పోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అఖిల పక్షాలు/అఖిల సంఘాలతో ఆయన భేటీ అయ్యా రు.
తమపై అక్రమ కేసులు పెట్టించి....
అయితే, గడిచిన నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు. . ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని, పోరుకు సిద్ధపడినంత మాత్రం చేత మిగిలిన పక్షాలు అదేవిధంగా ముందుకు వస్తాయని ఆశించడం బాబు తెలివిలేని తనంగా విమర్శిస్తున్నాయి వామపక్షాలు. ప్రత్యేక హోదా విషయంలోను, ఏపీ ప్రయోజనాల విషయంలోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం నిన్నమొన్నటి వరకు ప్లే అయిందని అంటున్నారు. వాస్తవానికి బీజేపీ సంగతి తెలిసే తాము ఆది నుంచి రాష్ట్రం కోసం పోరాడుతున్నామని, అయితే, దీనిని గుర్తించకుండానే చంద్రబాబు.. వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులతో తమపై కేసులు కూడా పెట్టించారని వామపక్షాల నేతలు అంటున్నారు. సమావేశానికి హాజరైన నేతలు.. బాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. గత నాలుగేళ్లుగా బాబు తమ పోరాటాలను గుర్తించకపోగా, హోదా కోసం చేస్తున్న పోరును కించపరిచారని అన్నారు.
వ్యూహం ఫలించలేదా?
ఈ పరిణామాల నేపథ్యంలో బాబు వ్యూహం ఏమాత్రమూ సాకారం కాలేదనే వ్యాఖ్యల జోరు పెరిగింది. ఇక, ప్రధాన, ఏకైక విపక్షం వైసీపీ, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలు పూర్తిగా ఈ సమావేశాలకు దూరంగా ఉన్నాయి. అంతేకాదు, వారి వారి పంథాల్లోనే పోరుకు సిద్ధమని ప్రకటించాయి. దీనిని బట్టి.. బాబు వ్యూహం ఆదిలోనే బెడిసి కొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి బాబు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.