రాజధాని అమరావతికి మణిహారంగా నిలిచేలా హైస్పీడ్ సర్క్యులర్ రైల్వేలైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. విజయవాడ-అమరావతి-గుంటూరు-తెనాలి-కెసి కెనాల్-విజయవాడ మీదుగా ఈ సర్క్యులర్ రైల్వే లైన్ నిర్మాణం కానుంది. మొత్తం 105 కి.మీ. పొడవున సుమారు రూ. 10 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు రూపుదాల్చనుంది. ఇందుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు పొందేందుకు, సహాయసహకారాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
త్వరలో పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైలు
విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణం త్వరలోనే పట్టాలెక్కనుంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వుడాకు వాటా వుండేలా పీపీపీ పద్ధతిలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని అప్పుడే ప్రాజెక్టు లాభదాయకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టులో కేంద్రానికి 20 శాతం, వుడాకు 11 శాతం, 60 శాతం వరకు ప్రైవేటు సంస్థలకు, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం వుండేలా చూడాలన్నారు.
మెట్రో రైలుకు సంబంధించి రెండు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. కొమ్మాది నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, తాడిచెట్లపాలెం నుంచి ఈస్ట్ పాయింట్ వరకు మొత్తం 34.44 కి.మీ, లేదంటే కొమ్మాది నుంచి గాజువాక, గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, తాడిచెట్ల పాలెం నుంచి ఈస్ట్ పాయింట్ వరకు మొత్తం 42.54 కి.మీ మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు వున్న అవకాశాలను వివరించారు. మొదటి ఆప్షన్‌లో 35 స్టేషన్లు, రెండో ఆప్షన్ కింద 41 స్టేషన్లు నిర్మించాల్సి వుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 13 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు.