ఆట లోనే కాదు ఉన్నతమైన ప్రమాణాలను నెలకొల్పడంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. దక్షిణాఫ్రికా సిరీస్ లో బాల్ ట్యాపరింగ్ కి తమ క్రికెటర్లు పాల్పడిన తీరుపై ఐసిసి కి మించి ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పుడు జరిగిన తప్పుడు పనిని భవిష్యత్తులో తమ ఆటగాళ్లు ఏ ఒక్కరు చేయాలనే ఆలోచనే చేయకుండా చేసేందుకు నడుం కట్టింది. టీం కోచ్ డారెన్ లీమన్ ను శాశ్వతంగా తప్పించడం, జీవితకాలం మరెక్కడా అతడు కోచ్ గా ఉండేందుకు వీలు లేకుండా నిషేధం విధించనుంది. ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లకు ఏడాది పాటు నిషేధం విధించాలని భావిస్తుంది. వాస్తవానికి బాల్ ట్యాపరింగ్ కి పాల్పడిన వారికి జరిమానా ఒక మ్యాచ్ నిషేధంతో ఐసిసి సరిపెట్టింది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా అంతకు మించి వారికి శిక్ష విధించారని ఆగ్రహంతో రగిలిపోతున్న అభిమానులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు క్రికెటర్లకు భారీ భద్రత...
జెంటిల్మెన్ క్రీడకే మచ్చ తెచ్చి దేశానికి కొందరు క్రికెటర్లు తలవంపులు తెచ్చారని ఆసీస్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. వారి ఆగ్రహావేశాలు చల్లారే వరకు స్మిత్, వార్నర్, బెన్ క్రాఫ్ట్ ఇళ్లకు భారీ భద్రతను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిరీస్ నాల్గో టెస్ట్ కి ముందే కోచ్ రాజీనామా కోరినట్లు తెలుస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను బోర్డు రూపొందించాలని నిర్ణయించింది. ఇలా పలు కీలక సంచలన నిర్ణయాలతో క్రీడాభిమానులకు భరోసా కల్పిస్తూ టీంను పూర్తి ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని దేశాల క్రికెట్ బోర్డు లకు ఆదర్శంగా నిలిచింది.