పాపం జగన్ : ఫిరాయింపుల భయం; దౌర్జన్యాలపై నెపం

Update: 2016-12-13 16:41 GMT

వైకాపా అధినేత జగన్మోహన రెడ్డి ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితిలో పడ్డారు. ఓ స్థానానికి జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల విషయంలో ఆయనకు లోలోన ఒక రకమైన భయం ఉంది. అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పలేరు. అధికార పార్టీ మీద మరో రకం ఆరోపణ గుప్పిస్తూ.. ఎన్నికల్లో మాత్రం తాము అనుకున్న ఫలితం సాధించాలని, లబ్ది పొందాలని ఆయన చూస్తున్నారు. అందుకోసం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.. లేఖాస్త్రాల ద్వారా... వ్యక్తం చేస్తున్న భయాందోళనలతో పాలకపక్షాన్ని ముందే డిఫెన్సులో పడేయాలని చూస్తున్నారు.

అనంతపురం జిల్లాలో కనగానపల్లె ఎంపీపీ స్థానానికి ప్రస్తుతం ఎన్నిక జరగబోతోంది. అయితే.. ఈ ఎన్నికలో అధికార తెలుగుదేశం దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉన్నదనేది వైకాపా అధినేత ఆరోపణ. తెలుగుదేశం దౌర్జన్యాలు చేయకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలంటూ జగన్, ఏపీ డీజీపీ సాంబశివరావుకు ఒక లేఖ కూడా రాశారు. పరిటాల సునీత దౌర్జన్యాలకు పాల్పడాలని చూస్తున్నారంటూ లేఖలో ఆరోపించారు. నిష్పాక్షికంగా ఎన్నిక జరిగేలా చూడాలని కోరారు.

జగన్ ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతాయనే ఆరోపణలకు దిగడానికి ఓ కారణం ఉంది. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల విషయంలో తమ పార్టీ నెగ్గేంత బలం తెలుగుదేశానికి లేదని ఆయన అంటున్నారు. తమకు బలం లేకపోయినా సరే.. తెలుగుదేశం అభ్యర్థిని బరిలోకి దించిందనేది ఆయన వాదన. అంటే.. దౌర్జన్యాలు చేసైనా సరే.. బలం లేని తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తెదేపా కుట్ర చేస్తున్నదనేది జగన్ చేస్తున్న ఆరోపణ.

నిజానికి ఆయనలోని అసలు భయం ఒకటైతే పైకి మాత్రం దౌర్జన్యాల రంగు పులుముతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. బలం లేకుండానే ఎన్నికలో అభ్యర్థి బరిలోకి దిగితే.. దాని పర్యవసానంగా ఫిరాయింపులు లేదా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. వైకాపా కు చెందిన కొందరు అధికార తెలుగుదేశం కు అనుకూలంగా ఓటు చేసే అవకాశం ఉంటుంది. వారిని కట్టడి చేసుకోలేని స్థితిలో ఉన్న జగన్, తన బలహీనతను పైకి చెప్పుకోకుండా.. తెదేపా దౌర్జన్యాలు చేస్తుందంటూ ఎదురుదాడికి దిగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొత్తానికి కనగానపల్లె ఎంపీపీ స్థానం ఎలాంటి రాజకీయ మలుపులు, పునరేరకీకరణలకు వేదిక అవుతుందో చూడాలి.

Similar News